న్యాయ సమీక్ష.. రెండు, మూడుసార్లు టెండర్లను పిలిచిన తర్వాతే రివర్స్ టెండరింగ్ ద్వారా 108, 104 అంబులెన్సుల నిర్వహణ సంస్థను ఎంపిక చేసినట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. 108 అంబులెన్సుల నిర్వహణ సంతృప్తికరంగా లేదని, అంతేకాకుండా బాధ్యతల నుంచి వైదొలుగుతానని బీవీజీ సంస్థ తెలియజేసిందని పేర్కొంది.
ఈ స్థానంలో నిబంధనలు అనుసరించి అరబిందో ఫార్మా ఫౌండేషన్ సంస్థను ఎంపిక చేసినట్లు తెలిపింది. వేతనాల పెంపు, ఇతర నిర్వహణ ఖర్చు వల్ల 108 అంబులెన్సుల నిర్వహణ వ్యయం పెరిగిందని ప్రభుత్వం మంగళవారం రాత్రి ఓ ప్రకటనలో వివరించింది.
'108 అంబులెన్సు సర్వీసుల నిర్వహణ కోసం బీవీజీ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం 2016 అక్టోబరు 7న ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని కాలపరిమితి 2019 నవంబరు 6తో ముగిసింది. అంబులెన్సుల అప్పగింతలో జాప్యం జరిగినందున ఈ కాల పరిమితిని 2020 డిసెంబర్ 12 వరకు ప్రభుత్వం పొడిగించింది. అయితే.. అంబులెన్సుల నిర్వహణ తీరు సంతృప్తికరంగా లేనందున ఈ సంస్థకు పలుమార్లు నోటీసులు జారీ చేసింది.
108 సర్వీసుల నిర్వహణ కోసం 2019 నవంబరు 19న టెండర్లు పిలవగా అరబిందో ఫార్మా ఫౌండేషన్ కన్సార్షియం, ఎంకేపీ ఇంపెక్స్ ఎల్‌ఎల్‌పీ కన్సార్షియం దరఖాస్తు చేశాయి. తర్వాత ఎంకేపీ సంస్థ నుంచి స్పందన కనిపించనందున ప్రభుత్వం 2020 జనవరి 3న మళ్లీ టెండర్లు పిలిచింది. అరబిందో ఫార్మా కన్సార్షియం, యూకే అండ్ శ్రీ సాయి సేవా సమితి కన్సార్షియం దరఖాస్తు చేశాయి. 2020 జనవరి 8న రివర్స్ టెండరింగ్‌లో అరబిందో ఫార్మా ఫౌండేషన్ సంస్థను ఎంపిక చేసింది.
రివర్స్ టెండరింగ్, చర్చల ద్వారా కొత్త వాహనంపై రూ.3.12 లక్షలు, ప్రస్తుత వాహనంపై రూ.3.87 లక్షల వంతున మొత్తమ్మీద ఏడేళ్లకు కలిపి రూ.185.53 కోట్లు ఆదా అయింది. నెలకు ఒక్కో కొత్త వాహనానికి రూ.1.78 లక్షలు, పాత వాహనానికి రూ.2.21 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రస్తుతం వాహనం డ్రైవరు, ఈఎంటీకి రూ.10 వేల నుంచి రూ.15 వేల మధ్య వేతనాలు చెల్లిస్తున్నారు. కొత్త సంస్థ.. అనుభవాన్ని అనుసరించి ఈఎంటీకి నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల మధ్య, డ్రైవరుకు రూ.18 వేల నుంచి రూ.28 వేలు చెల్లించబోతోంది. పాత వాహనాల నిర్వహణ, మరమ్మతులు, వాహనాల సంఖ్య పెరిగినందువల్ల వ్యయం పెరిగింది.
- 104 సర్వీసు నిర్వహణ బాధ్యతలు చూస్తున్న సంస్థతో ఒప్పందం 2019 మార్చిలో ముగిసింది. రివర్స్ టెండరింగ్‌లో అరబిందో ఫార్మా ఫౌండేషన్ ఎంపికయింది. రివర్స్ టెండరింగ్ వల్ల ఏడేళ్లకు కలిపి రూ.213.87 కోట్లు ఆదా అయింది. నిర్వహణ కింద నెలకు ఒక్కో వాహనానికి రూ.1.80 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుంది.
- 432 కొత్త 108 అంబులెన్సులు, 676 కొత్త 104 వాహనాలను ఫైనాన్సింగ్ విధానంలో కొనడానికి ఏపీ ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా 2019 సెప్టెంబరులో ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. సంస్థల నుంచి సానుకూలత కనిపించలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘జీఈఎం’ పోర్టల్’ ద్వారా వాహనాల కొనుగోలుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది’ అని ప్రకటనలో పేర్కొంది.