Award to Double bedroom houses Scheme : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండు పడక గదుల ఇళ్లకు మరో అవార్డు లభించింది. స్మార్ట్ సిటీ ఏక్స్పో వరల్డ్ కాంగ్రెస్‌లో ప్రపంచ స్థాయిలో రెండు పడక గదుల డిగ్నిటీ హౌసింగ్ ఫైనలిస్ట్ అవార్డు వచ్చింది. స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఈ సదస్సు జరిగింది. ఈ అవార్డు రావడం పట్ల పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్... మంత్రి కేటీఆర్‌ను కలిసి అవార్డు అందించారు. ఈ సందర్భంగా అధికారులను మంత్రి అభినందించారు. ఖైరతాబాద్ ఇందిరా నగర్లో రెండు పడకల గదుల డిగ్నిటీ కాలనీ ప్రారంభానికి సిద్ధంగా ఉందని.. సకల హంగులతో రూ.17.85 కోట్ల వ్యయంతో నిర్మించిన 210 గృహాలు త్వరలో ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌కు జీహెచ్ఎంసీ అధికారులు తెలియజేశారు. జీ+5 అంతస్తులో 5 బ్లాకుల్లో నిర్మాణాలు చేపట్టామని.. సీసీ రోడ్డు, తాగునీరు, 7 లిఫ్టులు, మొత్తం 2,556 చదరపు గజాల్లో గల మొత్తం 7 షాపులు, డ్రైనేజీ కాలువ, తాగునీరు సంపు ఏర్పాటు చేశామని చెప్పారు.