ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా మదనపల్లెలోని శివనగర్‌లో జరిగిన జంట హత్యల ఉదంతం ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఉన్నత విద్యావంతులైన తల్లితండ్రులు పురుషోత్తం, పద్మజలు తమ కుమార్తెలైన అలేఖ్య, సాయిదివ్యలను పాశవికంగా అంతమొందించారనే వార్త అందరినీ గగుర్పాటుకి గురి చేసింది. నిందితులుగా తల్లితండ్రులను అరెస్ట్ చేసిన పోలీసులు... కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. వైద్యుల సిఫార్సుతో మెరుగైన వైద్యం కోసం విశాఖకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నా.. అలేఖ్య, సాయిదివ్యల సామాజిక మాధ్యమాల ఖాతాల వ్యవహారం నిర్లక్ష్యానికి గురవుతున్నట్లు కనిపిస్తోంది.
ఆ రెండు రోజులు ఏం జరిగింది..?
పెద్దమ్మాయి అలేఖ్య సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టులు వివాదాస్పదంగా మారాయి. అన్యమతాలను కించపరుస్తూ... అదే సమయంలో శివుడు వస్తున్నాడు, పని అయిపోయింది అంటూ అలేఖ్య చేసినట్లు భావిస్తున్న పోస్టులు ఇప్పుడీ కేసులో కీలకంగా మారాయి. అలేఖ్య ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం ఖాతాల్లో ఆమె వ్యవహరించిన తీరు జనవరి 16వరకూ బాగానే ఉంది. హత్యలు జరిగిన 3 రోజుల ముందు నుంచి మాత్రమే వివాదస్పద పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. ఈనెల 21న శివ ఈజ్ కమింగ్ అని పోస్టు పెట్టిన అలేఖ్య... అదే రోజు వర్క్ ఈజ్ డన్ అని 2 పోస్టులు పెట్టింది. తిరిగి 22న కృష్ణుడి బొమ్మతో కలిసి సెల్ఫీ దిగిన అలేఖ్య... మోహినీ హ్యాష్ ట్యాగ్‌ని వాడింది. ఫేస్‌బుక్‌లోని ఖాతా పేరును మోహినీగా మార్చింది. అదే రోజు వేరే మతానికి సంబంధించి వివాదస్పద వ్యాఖ్యలతో మరో పోస్టు చేసింది. ఈ పోస్టులను అలేఖ్య కవితలు రాసుకొనే "ది హార్ట్స్ పన్ పొయెట్" అనే ఖాతాలోనూ పోస్టు చేసింది. వారం నుంచి ఆహారం తీసుకోకుండా ఇంట్లోనే పూజలు చేస్తున్నట్లు తల్లి పద్మజ పోలీసులకు చెప్పింది. కానీ ఘటన జరిగిన 2 రోజుల ముందు కూడా అలేఖ్య సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంది.
మిస్టరీగా సాయి దివ్య ఖాతా!
ఇక్కడే ఆలోచన రేకెత్తిస్తున్న మరో అంశం చిన్నకుమార్తె సాయిదివ్య సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టులు డిలీట్ అవ్వటం. అసలు ఈ పోస్టులను ఎవరు డిలీట్ చేశారు? ఫేస్‌బుక్ ఖాతా ఏమైంది? ఇన్ స్టాగ్రాంలో పోస్టులన్నీ సున్నా చూపించటం వెనుక ఎవరి పాత్ర ఉంది? అలేఖ్య ఫొటోనే సాయి దివ్య డిస్ ప్లే పిక్చర్‌గా ఎవరు మార్చారు? దివ్స్ అలేఖ్య అని పేరు ఎవరు పెట్టారు? ఇవన్నీ వెలుగులోకి రావాల్సిన అంశాలు. పోనీ అలేఖ్యకే 2, 3 అకౌంట్లు ఉన్నాయా? అందులో ఒకటి సాయిదివ్య పేరుతో ఉందా అంటే… గతంలో అలేఖ్య చేసిన కొన్ని పోస్టులకు కింద సాయిదివ్య సమాధానాలివ్వటం స్పష్టంగా కనిపిస్తోంది. అంటే సాయిదివ్య అకౌంట్లో ఎవరో మార్పులు చేశారు. ఇప్పటికీ ఆ ఖాతా ప్రైవేట్‌గానే చూపిస్తోంది. అలేఖ్య స్నేహితులు చెబుతోన్న మరో విషయం ఏంటంటే ఆమె ఖాతా సైతం ప్రైవేట్‌లోనే ఉండేదట. కేవలం స్నేహితులు, అలేఖ్య అనుమతించిన వాళ్లే ఆ పోస్టులను చూడగలిగేవాళ్లట. మరి ఆ వివాదస్పద పోస్టులను అందరూ చూడగలిగేలా ప్రైవసీ సెట్టింగ్స్ మార్చిందెవరనే విషయంలోనూ పలు అనుమానాలున్నాయి.