Annaram Pump House Motors: వేగంగా నీటిని తోడివేయడంతో భారీ వరదతో నీట మునిగిన అన్నారం పంపుహౌస్‌లో మోటార్లు, పంపులు బయటపడ్డాయి. మోటార్లకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, బురదను శుభ్రం చేసే పనిని చేపట్టామని సంబంధిత ఇంజినీర్లు తెలిపారు. కీలకమైన కంట్రోల్ ప్యానల్ గదిలో కూడా పరికరాలను శుభ్రం చేయడంతోపాటు, అవి ఏమైనా దెబ్బతిన్నాయా అన్నది పరిశీలిస్తున్నారు. నీట మునిగిన పంపుహౌస్‌ను పునరుద్ధరించే పనిని గత సోమవారం ప్రారంభించారు. సుమారు ఆరువేల అశ్వశక్తి(హార్స్‌పవర్) సామర్థ్యమున్న భారీ మోటార్లను వినియోగించి నీటిని తోడటం ప్రారంభించారు. పంపులు, మోటార్ల వరకు నీటిని తోడి వాటిని శుభ్రపరిచే పనినీ చేపట్టారు. మిగిలిన నీటిని కూడా తోడేశాక వీటిని బయటకు తీసి ఆరబెట్టాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
మేడిగడ్డ పంపుహౌస్‌లో నీటి తోడివేత(డీవాటరింగ్) చేపట్టినా పూర్తిస్థాయిలో జరగడానికి మరికొంత సమయం పట్టనుంది. నీటిమట్టం తగ్గడంతోపాటు విద్యుత్తు పునరుద్ధరణ కూడా జరిగాక వేగం పుంజుకొనే అవకాశం ఉంది. ఈ పంపుహౌస్‌లో నష్టం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే నీటి తోడివేత పూర్తయితే కానీ ఆ విషయం తెలియదు.
ఎలాంటి నష్టం జరగలేదు..!
అన్నారం పంపుహౌస్‌ను వేగంగా పునరుద్ధరించేందుకు ఇంజినీర్లు, గుత్తేదారు సంస్థతో కలిసి కృషిచేస్తున్నారు. ఎప్పుడు ఏ పని చేయాలన్నది ఎత్తిపోతల సలహాదారు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఇంజినీర్లకు మార్గదర్శనం చేస్తోన్నారు. మొదట 117 మీటర్ల మట్టం వద్ద ఉన్న కంట్రోల్‌రూము వరకు నీటిని తోడి అందులోని పరికరాలను శుభ్రపరచడం, వేడిగాలిని వినియోగించి ధూళి, తేమ లేకుండా చేయడంలో సిబ్బంది నిమగ్నమయ్యారు. శుక్రవారం 111 మీటర్ల వరకు నీటిని తోడేశారు. పంపులకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, బయటకు తీసి ఆరబెట్టాక పూర్తి సమాచారం తెలుస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కంట్రోల్ రూములో నిర్వహణకు సంబంధించిన కీలకమైన పరికరాలన్నీ ఉంటాయి. కంట్రోల్ ప్యానల్స్, డిజిటల్ సపోర్ట్ సిస్టమ్, ఎలక్ట్రికల్ ఛార్జెస్, బ్యాటరీ రూము, డిజిటల్ ఆపరేటర్ సహా అన్నీ శుభ్రం చేయడం త్వరలోనే పూర్తవుతుంది. కంట్రోల్ రూము నీళ్లలో మునిగినందున దానిలో ఏర్పాటుకు మళ్లీ కొన్ని కొత్త పరికరాలు అవసరమవుతాయని, వాటి కోసం ఇప్పటికే విదేశీ సంస్థలకు ఆర్డర్ చేశామని నిర్మాణ సంస్థ ప్రతినిధి తెలిపారు. వచ్చే నెలలో అన్నారం పంపుహౌస్ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్నారు.
ఇదీ చదవండి:దెబ్బతింటున్న కాళేశ్వరం ప్రాజెక్టు గ్రావిటీ కెనాల్.. నీటిలోనే పంప్‌హౌస్ మోటర్లు