ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కొండయ్యపాలేనికి చెందిన గోవిందరాజులు.. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పని చేస్తున్నారు. విధి నిర్వహణలో తీరిక లేకుండా గడుపుతూనే.. మరో వైపు శునకాల ఆకలి(Feeding street dogs) తీరుస్తున్నారు. మొదట్లో ఉదయం మాత్రమే కుక్కలకు బిస్కెట్లు అందించేవారు. రెండేళ్లుగా బిర్యానీ తయారు చేసి రాత్రి సమయాల్లోనూ క్రమం తప్పకుండా శునకాలకు పెడుతున్నారు. మూగజీవాల ఆకలి తీర్చడం కోసం రోజూ 30 కేజీల బియ్యం, పది కేజీల కోడిమాంసంతో.. బిర్యానీ చేస్తున్నారు. ప్యాకెట్లలో నింపుకొని.. కాకినాడలోని వీధుల్లో తిరుగుతూ.. కనిపించిన శునకాలన్నింటికీ పెడుతున్నారు.
Pet Lover: వీధి శునకాలకు చికెన్ బిర్యానీ - kakinada city news
కొవిడ్ సమయంలో.. పేదలు, నిరాశ్రయులు, ఉపాధి కోల్పోయిన వారికే ఆహారం దొరకడం కష్టమైంది. మూగజీవాల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన కొందరు.. అలాంటి జంతువుల ఆకలి తీరుస్తున్నారు. గడప దాటి బయటకు వచ్చేందుకే జంకుతున్న ఈ విపత్కర సమయంలోనూ.. వీధివీధి తిరిగి శునకాలకు ఆహారం అందిస్తున్నారు.
కాకినాడలో వీధి శునకాలకు చికెన్ బిర్యానీ
గోవిందరాజులు స్ఫూర్తితో మరి కొందరు యువత, మహిళలు కూడా మూగ జీవాలకు ఆహారం అందిస్తున్నారు. స్వయంగా వంట చేసుకొని వీధుల వెంట తిరిగి కుక్కలకు తిండి పెడుతున్నారు. శునకాలతోపాటు పక్షులు, బాతులకూ ఆహారం అందిస్తున్నారు. కొవిడ్ సమయంలోనూ మూగజీవాల ఆకలి తీర్చుతూ ఆదర్శంగా నిలుస్తున్న కాకినాడ వాసులను పలువురు ప్రశంసిస్తున్నారు.