తెలంగాణ

telangana

Ambedkar Jayanthi Celebrations: 'రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు'

By

Published : Apr 14, 2022, 6:31 PM IST

Ambedkar Jayanthi Celebrations: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బీఆర్ అంబేడ్కర్‌ 131వ జయంతోత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. రాజకీయ పార్టీలు, వివిధ సంఘాలు పండుగ వాతావరణంలో వేడుకలను నిర్వహించుకున్నాయి. అంబేడ్కర్‌ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రజాప్రతినిధులు సూచిస్తుండగా... ఆయన ఆశయాలు నెరవేర్చాలంటూ పలు సంఘాలు ర్యాలీలు, ప్రదర్శనలు చేశాయి.

Ambedkar
Ambedkar

Ambedkar Jayanthi Celebrations: డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ జయంతి వేడుకలను పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఘనంగా నిర్వహించుకున్నారు. దేశంలో పండగ వాతావరణం నెలకొందని.. శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అంబేడ్కర్‌ ఆశయ సాధనకు అనుగుణంగా కేసీఆర్‌ పాలన సాగిస్తున్నారని.. సభాపతి పేర్కొన్నారు. శాసనసభ ఆవరణలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పోచారం పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అసెంబ్లీ ఆవరణలో...

మంత్రులు.. ఎమ్మెల్యేలు: హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌ వద్ద అంబేడ్కర్‌ విగ్రహానికి మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, మహమూద్‌ అలీ ఘనంగా నివాళులు అర్పించారు. సికింద్రాబాద్ బోయన్‌పల్లి కూడలిలో మంత్రి మల్లారెడ్డి కేక్‌ కట్‌ చేశారు. వికారాబాద్‌లో ఏర్పాటు చేసి ర్యాలీలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొని అనంతరం నిర్వహించిన సభలో ప్రసంగించారు. నిజామాబాద్‌ వేడుకలకు మంత్రి ప్రశాంత్‌రెడ్డి హాజరయ్యారు. జిల్లాలోని మాక్లూర్‌ మండలం మాణిక్‌ బండార్‌లో.. సఫాయి కార్మికురాలి కాళ్లను ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పాలతో కడిగారు. హనుమకొండ వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పాల్గొన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్.. కళాకారులతో డప్పుకొడుతూ ఆడిపాడారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 37 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన.. అంబేడ్కర్‌ కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆవిష్కరించారు.

గాంధీభవన్‌లో:గాంధీ భవన్‌లో కాంగ్రెస్ నేతలు.. అంబేడ్కర్‌ జయంతోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. అంబేడ్కర్ సేవలను నేతలు గుర్తు చేసుకున్నారు. నిజామాబాద్‌ పులాంగ్‌ చౌరస్తాలో అంబేడ్కర్‌ విగ్రహానికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రేణుకాచౌదరి నివాళులు అర్పించారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో.. రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆవిష్కరించారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ హిల్ కాలనీ బస్టాండ్‌ వద్ద అంబేడ్కర్‌ విగ్రహానికి.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి శ్రద్ధాంజలి ఘటించారు. అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలంటూ వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవుపలికారు.

గాంధీభవన్‌లో..

భాజపా కార్యాలయంలో:భాజపా రాష్ట్ర కార్యాలయంలో అంబేడ్కర్‌ వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నాయి. వివిధ సంఘాల నాయకులు కార్యక్రమానికి హాజరయ్యారు. ట్యాంక్‌ బండ్‌ వద్ద అంబేడ్కర్‌ విగ్రహానికి బండి సంజయ్‌ పూల వేసి నివాళులు అర్పించారు. అంబేడ్కర్‌కు భారతరత్న ఇచ్చి భాజపా ఘనత చాటుకుందని బండి పేర్కొన్నారు.

భాజపా కార్యాలయంలో..

ఘనంగా నివాళులు: ట్యాంక్ బండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాంక్‌ బండ్‌ వద్ద ప్రజాకవి గద్దర్‌.. కళాకారులతో కలిసి నృత్యం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద మాదిగ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో.. జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. సంగారెడ్డిలో ఐబీ నుంచి పాత బస్టాండు వరకు తెలంగాణ అంబేడ్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో.. 2కే రన్ ఫర్ అంబేడ్కర్ కార్యక్రమం నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల మూడో టి.ఎం.సి కాలువ భూసేకరణ వ్యతిరేకిస్తున్న నిర్వాసితులు అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులు అర్పించి తమ విలువైన పంట భూములను రాజ్యాంగబద్ధంగా పరిరక్షించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details