తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్‌లో అమెజాన్ డేటా సెంటర్ కార్యకలాపాలు ప్రారంభం

Amazon Data Center in Hyderabad : అమెజాన్ వెబ్ సర్వీసెస్ హైదరాబాద్‌లో తన అతిపెద్ద డేటా సెంటర్ కార్యకలాపాలు ప్రారంభించింది. భారతదేశంలో రెండో ఇన్‌ఫ్రా కేంద్రంగా నగర శివారు మహేశ్వరంలోని ఆసియా పసిఫిక్ రీజియన్‌కు శ్రీకారం చుట్టినట్లు ప్రకటించింది. తాజా డేటా సెంటర్‌తో ఏడాదికి 48వేల మందికిపైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 2030 వరకు హైదరాబాద్ కేంద్రంపై రూ.36,300 కోట్ల పెట్టుబడి లక్ష్యంతో ఉన్నట్లు అమెజాన్ వెబ్ సర్వీసెస్ తెలిపింది.

Hyderabad is Booming in IT Sector
Hyderabad is Booming in IT Sector

By

Published : Nov 22, 2022, 1:16 PM IST

Amazon Data Center in Hyderabad : ఐటీ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్ నగరంలో మరో అతిపెద్ద కేంద్రం కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. భారతదేశంలో తన రెండో మౌలిక సదుపాయాల ప్రాంతంగా ఆసియా పసిఫిక్ రీజియన్‌ను ప్రారంభించినట్లు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రకటించింది. డెవలపర్‌లు, అంకురాలు, వ్యవస్థాపకులు, సంస్థలు, ప్రభుత్వం డేటా సెంటర్‌ల నుంచి తమ అప్లికేషన్లను అమలు చేసేందుకు, వినియోగదారులకు సేవలు అందించే సదుపాయం ప్రారంభమైనట్లు పేర్కొంది.

Amazon Web services Data Center in Hyderabad : డేటా అనలిటిక్స్, సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా ఆవిష్కరణలకు ఊతమిస్తూ వినియోగదారుల సేవల కోసం అధునాతన సాంకేతికలను ఉపయోగించనున్నారు. హైదరాబాద్‌లో డాటా కేంద్రం ఏర్పాటు కోసం భారీ పెట్టుబడి పెడుతున్నట్లు 2020 నవంబర్ 6న అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రకటించింది. డేటా కేంద్రాల ఏర్పాటు కోసం 20,761 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనున్నట్లు అప్పట్లో అమెజాన్ ప్రకటించింది.

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద విదేశీ పెట్టుబడిగా పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అప్పట్లో వ్యాఖ్యానించారు. తాజాగా మహేశ్వరంలోని అతిపెద్ద డేటా కేంద్రంలో కార్యకలాపాలు ప్రారంభించినట్లు సంస్థ ప్రకటించింది. సంస్థ ద్వారా ఏడాదికి 48వేల మందికిపైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపింది. ఆసియా పసిఫిక్ రీజియన్ ద్వారా దశల వారీగా 2030 వరకు రూ.36,300 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు స్పష్టం చేసింది.

భారతదేశ డేటాసెంటర్ హబ్‌గా తెలంగాణ స్థానాన్ని అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా కేంద్రం మరింత సుస్థిరం చేస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. రూ.36,300 కోట్ల భారీ పెట్టుబడితో రీజియన్ ప్రారంభం సంతోషకరమని అన్నారు. భవిష్యత్‌లో క్లౌడ్ కంప్యూటింగ్ శక్తి, అవసరాన్ని గుర్తించామన్న ఆయన.. రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం కలిగేలా ఈ-గవర్నెన్స్, హెల్త్‌కేర్, పురపాలక రంగాల్లో మెరుగైన సేవలు, కార్యకలాపాల కోసం అమెజాన్ వెబ్ సర్వీసెస్‌తో కలిసి పనిచేసినట్లు చెప్పారు. హైదరాబాద్‌లోని కొత్త అమెజాన్ కేంద్రం ద్వారా దేశంలోని అనేక సంస్థలు, అంకురాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు మరిన్ని ఆవిష్కరణలు, అభివృద్ధికి దోహద పడుతుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details