కరోనా మహమ్మారి కమ్యూనిటీ వ్యాప్తి ప్రారంభమైందని... ఉద్యోగులు తగిన జాగ్రత్తలు పాటిస్తూ విధులు నిర్వర్తిస్తూ... ప్రజల ఆరోగ్యానికి అండగా నిలువాలని ఏఐఎస్జీఈఎఫ్ జాతీయ అధ్యక్షులు సుభాశ్ లాంబ ఆకాంక్షించారు. మీట్ యాప్ ద్వారా సుభాశ్ లాంబ, ప్రధాన కార్యదర్శి శ్రీకుమార్ నేతృత్వంలో నిర్వహించిన అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య జాతీయ కార్యవర్గ సమావేశంలో తెలంగాణ నుంచి టీఎన్జీవో నేతలు కారం రవిందర్ రెడ్డి, మామిళ్ల రాజేందర్, బండారు రేచల్ పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న కొవిడ్ పరిస్థితులు, వైరస్ కట్టడిలో ఉద్యోగులు నిర్వహిస్తోన్న సేవలు, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సుదీర్ఘంగా చర్చించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆత్మ నిర్భర భారత్లో భాగంగా రాయితీలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాలని... టీఎన్జీవో చేసిన ప్రతిపాదనలు అంగీకరిస్తూ కేంద్ర కేబినెట్ సెక్రటరీకి, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి లేఖలు రాయాలని సమావేశం తీర్మానించింది. కేంద్రం అవలంబిస్తోన్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ.. కార్మిక సంఘాలు ఆగస్టు 9న “సేవ్ ఇండియా” పేరుతో చేపట్టిన సత్యాగ్రహ నిరసన కార్యక్రమానికి ఏఐఎస్జీఈఎఫ్ మద్దతుతో కూడిన సంఘీభావం ప్రకటించింది.