కరోనా నియంత్రణలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ నాంపల్లిలోని తెజస రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు కోదండరాం దీక్ష చేపట్టారు. ఉదయం పది గంటలకు ప్రారంభమైన దీక్ష.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. నిరసన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ నిమ్మరసం ఇచ్చి కొదండరాం చేత దీక్ష విరమింపజేశారు. కరోనా వల్ల తలెత్తిన సమస్యలు పరిష్కారించాలని తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నేత గోవర్ధన్, శివసేన రాష్ట్ర అధ్యక్షుడు సుదర్శన్, పీఓడబ్ల్యూ సంధ్య హాజరై దీక్షకు సంఘీభావం ప్రకటించారు.
'కరోనా పైసల లెక్క చెప్పాల్సిందే'
కొవిడ్ వైరస్ నిర్మూలన కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎన్ని నిధులు వచ్చాయో బహిర్గతం చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. కరోనాను సంపూర్ణంగా అరికట్టేందుకు రాష్ట్రంలోని వనరులను పూర్తిగా ఖర్చు చేయాలన్నారు.
- "కోదండరాం, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు"
వెంటనే అఖిలపక్ష భేటీకి పిలవాలి
కొవిడ్ ఎవరికి వచ్చినా.. గాంధీ ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తామన్న కేసీఆర్.. మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలకు మాత్రం కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. కేసీఆర్ ద్వంద వైఖరి బయట పడింది. ప్రతిపక్ష పార్టీలు లేవని అవహేళన చేస్తున్న కేసీఆర్.. ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి.