తెలంగాణ

telangana

ETV Bharat / state

పత్తి కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చూడండి: నిరంజన్​ రెడ్డి - మొక్కజొన్న

పత్తి కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో వ్యవసాయ అనుబంధ శాఖలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

agriculture minister niranjan reddy review on marketing in hyderabad
పత్తి కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చూడండి: నిరంజన్​ రెడ్డి

By

Published : Oct 28, 2020, 8:33 PM IST

హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో వ్యవసాయ అనుబంధ శాఖలపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ జనార్దన్ రెడ్డి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, అగ్రోస్ ఎండీ రాములు, మార్క్‌ఫెడ్ సంస్థ ఎండీ భాస్కరాచారి హాజరయ్యారు.

రబీ పంట కాలం ప్రారంభమవుతున్న వేళ... వ్యవసాయ, మార్కెటింగ్, ఉద్యాన శాఖలు, టీఎస్ విత్తన సంస్థ, మార్క్‌ఫెడ్‌, వేర్ హౌజింగ్, అగ్రోస్ సంస్థల పనితీరు, పురోగతిపై విస్తృతంగా చర్చించారు. పత్తి కొనుగోళ్లలో, మొక్కజొన్న సేకరణలో ఇబ్బందులు తలెత్తకుండా మార్క్‌ఫెడ్‌ సంస్థ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. డిసెంబర్​లో కందుల సేకరణకు కార్యాచరణ పూర్తి చేయాలని సూచించారు. పంట కొనుగోళ్లకు అవసరమయ్యే గోనెసంచులు అందుబాటులో ఉంచాలన్నారు.

ధరలు అదుపులోకి వచ్చే వరకు రైతుబజార్లలో ఉల్లిగడ్డల అమ్మకాలు కొనసాగించడంతోపాటు, యాసంగిలో ఉల్లి సాగు ప్రాంతాలు, ఉత్పత్తి అవకాశాలను ఉద్యాన శాఖ పరిశీలించాలని మంత్రి తెలిపారు. ఉల్లి ధర పెరుగుదలకు కారణాలను పరిశీలించి ఈ పరిస్థితి తలెత్తకుండా ఉండడానికి రైతులకు ఎలాంటి రాయితీలు ఇవ్వాలో పరిశీలించాలని ఆదేశించారు. తెలంగాణ అవసరాలకు అనుగుణంగా ఉల్లి, టమాట ధరలు, సాగు విస్తీర్ణం స్థిరీకరణ కోసం ఉద్యాన, మార్కెటింగ్ శాఖలు ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలన్నారు.

వచ్చే ఏడాది ఆయిల్‌పాం సాగు, మొక్కల సేకరణ ప్రణాళికపై ఆరా తీసిన మంత్రి... ఈ సీజన్ మొక్కల ప్లాంటేషన్ 15 రోజుల్లో పూర్తి కావాలన్నారు. రసాయన ఎరువుల క్రమబద్ధీకరణ విషయంలో రైతులను చైతన్యం చేసేందుకు ప్రణాళిక చేపట్టడం ద్వారా శాస్త్రీయ పద్దతిలోనే రైతులు ఎరువులను వినియోగించాలని మంత్రి సూచించారు. వచ్చే ఏడాదికి పచ్చిరొట్ట పంట విత్తనాలు పెద్ద మొత్తంలో సేకరించి అందుబాటులో ఉంచాలని చెప్పారు.

రైతుబజార్లలో మిగిలే జీవ వ్యర్థాలు ఎరువులుగా మార్చేందుకు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖలో అన్ని స్థాయిల్లో పదోన్నతులు చేపట్టేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. అందుకు సంబంధించి ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాలను కూడా సంప్రదించి.. సూచనలు తీసుకోవాలన్నారు.

ఇదీ చూడండి:అధిక వ్యవసాయ రుణాలు మాఫీ చేసిన రాష్ట్రం తెలంగాణ: కేటీఆర్‌

ABOUT THE AUTHOR

...view details