తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఏడున్నరేళ్లుగా సహకారం లేదు.. ఈసారైనా విభజన హామీలు అమలు చేయాలి'

Telangana govt Agreement with Drillmec SpA : రాష్ట్రం ప్రగతి పథాన దూసుకుపోతున్నా... కేంద్రం నుంచి సహకారం మాత్రం దక్కడం లేదని ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్‌లో డ్రిల్‌మెక్‌ స్పా సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకున్న కార్యక్రమంలో... మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రపంచ స్థాయి సంస్థలు తరలిరావడం..... సీఎం కేసీఆర్‌ అద్భుత పాలనకు నిదర్శనమని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Telangana govt Agreement  with Drillmec SpA, KTR Comments
ఏడున్నరేళ్లుగా కేంద్రం సహకారం లేదన్న మంత్రి కేటీఆర్

By

Published : Jan 31, 2022, 11:05 AM IST

Updated : Jan 31, 2022, 11:58 AM IST

'ఏడున్నరేళ్లుగా సహకారం లేదు.. ఈసారైనా విభజన హామీలు అమలు చేయాలి'

Telangana govt Agreement with Drillmec SpA : హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థకు చెందిన తయారీ యూనిట్‌ ప్రారంభం కాబోతోంది. ఆయిల్‌ డ్రిల్లింగ్‌, రిగ్‌ సెక్టార్‌లో ప్రపంచ స్థాయి కంపెనీగా వెలుగొందుతున్న... డ్రిల్‌ మెక్‌స్పా .... రాష్ట్రంలో రూ.15వందల కోట్ల పెట్టుబడులతో ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో రిగ్గుల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ఇవాళ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ పరిశ్రమ ద్వారా 2,500 మందికి ఉపాధి దక్కుతుందన్న కేటీఆర్‌.... 80శాతం వరకు స్థానికులకే కొలువులు దక్కేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ప్రపంచ దేశాలు, దేశంలోని ఇతర రాష్ట్రాలను కాదని... హైదరాబాద్‌లో డ్రిల్‌మెక్‌ స్పా సంస్థ తమ యూనిట్‌ ఏర్పాటు చేయడం... రాష్ట్ర ప్రభుత్వ అద్భుత పాలనకు నిదర్శనమని మంత్రి కేటీఆర్ అన్నారు.

డ్రిల్‌ మెక్‌స్పా ఆయిల్‌ రిగ్గులను తయారు చేసే సంస్థ. తెలంగాణలో సముద్రం తీరం లేదు, ఆయిల్‌ రిజర్వ్‌లు లేవు. డ్రిల్‌ మెక్‌స్పాకు రాష్ట్రంలో ప్రత్యక్ష వినియోగదారులు కూడా లేరు. అయినా ఇటలీ, యూఎస్‌ వంటి దేశాలను కాదని భారత్‌లో పరిశ్రమ ఏర్పాటు చేయాలనుకోవడం...అందులోనూ దేశంలోని ఎన్నో రాష్ట్రాల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందినా హైదరాబాద్‌నే ఎంచుకోవడం... ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ అద్భుత పాలనకు నిదర్శనం.

-కేటీఆర్‌, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి

కేంద్రం సహకారం కరవు

KTR Comments on modi government : దేశంలో నాలుగో అతిపెద్ద ఎకానమీ కంట్రిబ్యూటర్‌గా తెలంగాణ అభివృద్ధి పథాన దూసుకుపోతున్నా.... కేంద్రం నుంచి సహకారం కరవైందని కేటీఆర్‌ ఆక్షేపించారు. ఏడున్నరేళ్లుగా.... రాష్ట్రానికి ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరలేదని ఆరోపించారు. బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న దృష్ట్యా.... హామీలు నిలబెట్టుకోవాలని ప్రధాని, ఆర్థికమంత్రికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని... తెలుగు రాష్ట్రాలకు స్పెషల్ ఇండస్ట్రీయల్ రాయితీలు అందించాలని కోరారు. ప్రధాని మోదీ పదేపదే సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటున్నారని... రాష్ట్రాలకు నిధులు ఇవ్వకపోతే ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. భారతదేశంలో నాలుగు పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటన్న మంత్రి... కేంద్రం సహకరిస్తే వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర సహకారం అవసరమని... హక్కులు, డిమాండ్ల కోసం కేంద్రంపై పోరాటం చేస్తామని వ్యాఖ్యానించారు.

తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇస్తామని విభజన చట్టంలో హామీ ఇచ్చారు. కానీ ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు. కేవలం నినాదంతో మేకిన్‌ ఇండియా సాకారం కాదు. అందుకు తగిన సంస్కరణలు, విధానాలు, మౌలికవసతులు తీసుకురావాలి. వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌గా దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్‌ పార్క్‌కు శ్రీకారం చుట్టాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌.. హైదరాబాద్‌ ఫార్మాసిటీ ఏర్పాటుచేయబోతున్నాం. కేంద్రం నుంచి వీటికి సాయం కోరినా స్పందన లేదు. 6 కొత్త ఇండస్ట్రియల్‌ కారిడార్లు ఏర్పాటుచేయాలని కోరాం. అది కూడా కార్యరూపం దాల్చలేదు. సైద్దాంతిక, రాజకీయ విభేదాల కారణంగా రాష్ట్రంపై వివక్ష చూపితే సంక్షోభం తలెత్తుంది. దేశంలో పారిశ్రామికీకరణకు, ఉద్యోగ కల్పనకు, ఆత్మనిర్భర్‌ భారత్‌ సంకల్పానికి విఘాతం కలుగుతుంది.

-కేటీఆర్‌, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి

డ్రిల్‌మెక్‌స్పాకు ధన్యవాదాలు

Minister Ktr tweet : ఆయిల్‌ డ్రిల్లింగ్‌, రిగ్‌ సెక్టార్‌లో ప్రముఖ కంపెనీగా వెలుగొందుతున్న డ్రిల్‌మెక్‌స్పా సంస్థ తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు తెలంగాణలో మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ పెట్టేందుకు డ్రిల్‌మెక్‌ స్పా రాష్ట్ర ప్రభుత్వంతో ఇవాళ అవగాహన ఒప్పందం చేసుకుంది. ఇటలీకి చెందిన డ్రిల్‌మెక్‌ స్పా ఆయిల్‌ డ్రిలింగ్‌, రిగ్గింగ్‌ సెక్టార్‌ ఎక్విప్‌మెంట్‌ తయారీలో ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థల్లో ఒకటిగా ఉంది. డ్రిల్‌మెక్‌ స్పా సుమారు రూ.1500 కోట్లు (200 మిలియన్‌ డాలర్ల) వ్యయంతో తెలంగాణ ఆయిల్‌ రిగ్‌ మెషినరీ తయారీ పరిశ్రమను స్థాపించనుంది. ఆయిల్‌, నేచురల్‌ గ్యాస్‌ వెలికితీసే మెషినరీ తయారు చేయడంలో డ్రిలింగ్‌ స్పా కంపెనీకి వందేళ్లకు పైగా అనుభవం ఉంది.ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 2,500ల మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి కేటీఆర్‌ ట్విటర్ వేదికగా తెలిపారు. ఈ సందర్భంగా పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణను ఎంచుకున్నందుకు డ్రిల్‌మెక్‌స్పా సంస్థకు ధన్యవాదాలు తెలిపారు.


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:Open well with full of Water: పాతాళగంగ పైపైకి.. నిండుకుండలా వ్యవసాయ బావి

Last Updated : Jan 31, 2022, 11:58 AM IST

ABOUT THE AUTHOR

...view details