Adani Group Representatives Meet CM Revanth Reddy : రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వివిధ పరిశ్రమల ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. ఆయా కంపెనీల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరుతున్నారు. ఫాక్స్‌కాన్, అమర రాజా, తాజాగా అదానీ గ్రూప్ ప్రతినిధులు రేవంత్‌ను కలిశారు. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులకు పెట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు అదానీ గ్రూప్ స్పష్టం చేసింది.
అదానీ సంస్థ ప్రతినిధులు, గౌతం అదానీ కుమారుడు కరణ్ అదానీ(Karan Adani Meet Revanth Reddy) సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ప్రభుత్వం మారినప్పటికీ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పనలో తమ కంపెనీ ముందుంటుందని అదానీ గ్రూప్ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే తలపెట్టిన ప్రాజెక్టులను కొనసాగిస్తూనే కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు సహకరించాలని ముఖ్యమంత్రిని కోరారు.
ఫాక్స్‌కాన్ ప్రతినిధులతో సీఎం భేటీ - 'స్నేహ పూర్వకంగా ఉండే విధానం అవలంభిస్తాం'
Karan Adani Meet Telangana CM Revanth Reddy : రాష్ట్రంలో ఏరోస్పేస్ పార్కు, డేటా సెంటర్ ప్రాజెక్టు ఏర్పాటుతో పాటు, కొత్త ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు. అదానీ గ్రూప్ పెట్టుబడులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిస్వాగతించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పన కోసం పరిశ్రమలకు రాయితీలు, సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అదానీ ఏరో స్పేస్ సీఈఓ ఆశిష్ రాజ్ వంశీ తదితరులు పాల్గొన్నారు.