Regularisation From Today: ప్రభుత్వ భూముల్లో నిర్మాణాల క్రమబద్ధీకరణకు.. ఇవాళ్టి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చే నెల 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు 125 గజాల దాకా ఉచితంగా క్రమబద్ధీకరించనున్నారు. ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపట్టిన చోట.. క్రమబద్ధీకరణకు సోమవారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆక్రమణదారులు 2014 జూన్ 2కి ముందు నుంచే ఆ స్థలంలో నివాసం ఉంటున్నట్లు నిర్ధారించే ఆధారాలతో మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఈ నెల 14న రెవెన్యూశాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్న విషయం తెలిసిందే. జీవో ఎంఎస్ 14ను అనుసరించి సోమవారం నుంచి వచ్చే నెల 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇంతకుముందు రాష్ట్రంలో నిర్వహించిన క్రమబద్ధీకరణ ప్రక్రియకు 2014 డిసెంబరు 30న జారీ చేసిన ఎంఎస్ నం. 58, 59 ప్రకారం నిబంధనలు వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది.
రుసుం చెల్లింపులపై అస్పష్టత..
తాజా ఉత్తర్వుల్లో పలు అంశాలపై స్పష్టత కొరవడింది. 2014 నాటి ఉత్తర్వుల్లోని నిబంధనలే వర్తిస్తాయని రెవెన్యూశాఖ పేర్కొంది. అయితే జీవో ఎంఎస్ నం 59 కింద ఆక్రమిత భూములకు చెల్లించాల్సిన రుసుం ఎన్ని కిస్తీల్లో, ఏ గడువు లోపల చెల్లించాలనేది స్పష్టత ఇవ్వలేదు.
గతంలో ఇలా..
గత క్రమబద్ధీకరణలో 5 కిస్తీల్లో చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ఒకేసారి రుసుం మొత్తం చెల్లించిన వారికి 5 శాతం మినహాయింపు సైతం ఇచ్చారు. భూముల క్రమబద్ధీకరణకు ఆర్డీవో ఛైర్మన్‌గా, తహసీల్దారు సభ్య కన్వీనర్‌గా కమిటీలను ఏర్పాటు చేశారు. దరఖాస్తు అందిన 90 రోజుల్లో క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేస్తామని, తహసీల్దారు సంబంధిత కుటుంబంలోని మహిళ పేరున డీడ్ జారీ చేస్తారని నాడు పేర్కొన్నారు. అభ్యంతరాలు, సూచనలు జారీ చేసే అధికారాన్ని జిల్లా సంయుక్త కలెక్టర్‌కు (ఇప్పుడు అదనపు కలెక్టర్లు ఉన్నారు) అప్పగించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అసైన్‌మెంట్ కమిటీలు లేవు. 2019లో ఆ కమిటీలను రద్దు చేసి కలెక్టర్‌కు అదనపు అధికారాలు అప్పగించారు. తహసీల్దార్లకు కూడా ఇప్పుడు ఎటువంటి అధికారాలు లేవు. ఈ నేపథ్యంలో భూముల క్రమబద్ధీకరణ ఎలా చేపడతారోనని రెవెన్యూవర్గాల నుంచి ఆశావహుల వరకూ ఎదురుచూస్తున్నారు.
దరఖాస్తు పత్రంతో జత చేయాల్సినవి
* ఆక్రమణదారు పేరు, భర్త/భార్య పేరుతోపాటు తండ్రి/భర్త, ఇతర కుటుంబ సభ్యుల పేర్లు
* ప్రస్తుత చిరునామా
* ఆక్రమించిన అభ్యంతరం లేని ప్రభుత్వ భూమి/భూ పరిమితి, మిగులు భూమి వివరాలు
* ఆక్రమిత స్థలం విస్తీర్ణం
* సర్వే నం, గ్రామం/వార్డు/మండలం