ఆంధ్రప్రదేశ్లోని విశాఖ మన్యంలో గ్రామాలు కొండలు, కోనల్లో విసిరేసినట్లు అక్కడ అక్కడ ఉంటాయి. ఏ గ్రామానికి వెళ్లాలన్నా సరైన రోడ్డుమార్గం ఉండదు. వాగులు, వంకలు దాటుకుంటూ కాలిబాటన పోవాల్సిందే. అలాంటి గ్రామమే పెదబయలు మండలంలోని జమదంగి. ఈ గ్రామానికి చేరుకోవాలంటే దాదాపు 20 కిలోమీటర్లు కొండలు, వాగులు దాటుకుంటూ వెళ్లాలి. బస్సులు, వాహనాలు లాంటివేమీ అక్కడి ప్రజలకు తెలియదు. పాడేరు నుంచి ఉదయం 6 గంటలకు ప్రయాణం మొదలు పెడితే.... మధ్యాహ్నం 3 గంటలకు గానీ ఊరు చేరుకోలేం.
జమదంగిలో గిరిజన విద్యార్థుల కోసం పాఠశాల ఉన్నా.... ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య ఉద్యోగం చేసేందుకు ఉపాధ్యాయులు ఎవ్వరూ ముందుకొచ్చేవారు కాదు. దీనివల్ల ఇక్కడి పిల్లలకు చదువు అనేది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. 2016లో ఉపాధ్యాయ ఉద్యోగం సంపాదించిన దాసుబాబుకు.... సర్కారు కొలువులో చేరేందుకు సాహసమే చేయాల్సి వచ్చింది. ఎంతో కష్టపడి అక్కడికి వచ్చిన ఆ యువ ఉపాధ్యాయుడికి సమస్యలే స్వాగతం పలికాయి. రాత్రయిందంటే చాలు ప్రాణాలు హరించే విషదోమలతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. స్థానికుల కొండభాష నేర్చుకుంటే తప్ప...విద్యార్థులకు చదువు చెప్పలేమని తెలుసుకున్న దాసుబాబు అక్కడే ఉండి వారి వ్యవహారిక భాషమీద పట్టుసాధించి విద్యార్థులను మచ్చిక చేసుకున్నాడు. మెల్లమెల్లగా విద్యార్థులకు చదువుపై ఆసక్తి కలిగించడమేగాక తెలుగుతో పాటు ఇంగ్లీష్ నేర్చుకునేలా వారిని తీర్చిదిద్దుతున్నాడు.