గుట్టుగా కుటుంబంలో ఒకరికి సోకుతున్న కరోనా మిగతా అందరికీ వ్యాపించి హడలెత్తిస్తోంది. దీంతో ఆ కుటుంబంలోని వృద్ధులు, చిన్న పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు సతమతం అవుతున్నారు. ముఖ్యంగా చాలామందిలో కరోనా సోకినా ఎలాంటి లక్షణాలు కన్పించడం లేదు. వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మరొకరికి వ్యాప్తి చెందుతోంది. ఒక్కో కుటుంబంలో ఆరేడు మంది వైరస్ బారిన పడి విలవిల్లాడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు ఉన్న ఇళ్లల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
పరిశుభ్రత ముఖ్యం
బయట నుంచి ఇంట్లోకి వెళ్లేప్పుడు చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కోవడం, అవకాశం ఉంటే స్నానం చేసి వెళ్లాలని చెబుతున్నారు. జ్వరం, జలుబు, దగ్గు లాంటి లక్షణాలు ఉంటే... మిగతా సభ్యులతో కలవకుండా ప్రత్యేక గదిలో క్వారంటైన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, ఆయాసం, తగ్గని జ్వరం, దగ్గు లాంటివి ఉంటే పరీక్షలు చేసుకొవాలి. శనివారం గ్రేటర్ వ్యాప్తంగా 888 మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటివరకు గ్రేటర్ పరిధిలో ఇదే గరిష్ఠం. రంగారెడ్డి జిల్లాలో 74 మంది, మేడ్చల్ జిల్లాలో 37 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఆరుగురు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
వేగంగా ఒకరి నుంచి ఒకరికి...
కొన్ని ప్రాంతాల్లో వైరస్ ఒకరికి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందుతోంది. హిమాయత్‌నగర్, నారాయణగూడలో వరుస కేసులు నమోదవుతున్నాయి. శనివారం దాదాపు పది మంది ఆరోగ్య మిత్రలు వైరస్ బారిన పడ్డారు. వీరంతా పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తుండటంతో సంబంధిత అధికారులు అప్రమత్తమయ్యారు. వారితో కలిసిన సిబ్బంది అందర్ని హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు.