తెలంగాణ

telangana

ETV Bharat / state

'80 శాతం మందిలో లక్షణాల్లేవ్.. కానీ ప్రమాదకరమే'

కరోనా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. లక్షణాలు బయట పడకపోవటంతో ప్రమాద తీవ్రత మరింతగా పెరుగుతోంది. ఇంట్లో ఒక్కరికి మహమ్మారి సోకినా 2-3 రోజుల వ్యవధిలోనే కుటుంబ సభ్యులంతా పాజిటివ్‌గా మారుతున్నారని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యంగా కనిపిస్తున్న వారిలో అకస్మాత్తుగా లక్షణాలు బయటపడుతున్నాయని ప్రముఖ యూరాలజిస్ట్‌ డాక్టర్‌ ఎన్‌.శ్రీనివాస్‌ తెలిపారు. వారాంతంలో విందులు, వినోదాలకు వెళ్లటం, వ్యక్తిగత దూరం పాటించకపోవడం, మాస్కు ధరించటంలో నిర్లక్ష్యం కారణంగా కేసులు పెరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.

80% have no corona symptoms, corona is dangerous for symptoms
'80 శాతం మందిలో లక్షణాల్లేవు.. కానీ కరోనా ప్రమాదకరం'

By

Published : Apr 19, 2021, 9:53 AM IST

కొవిడ్​ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. లక్షణాలు కనిపించకుండా వైరస్​ విస్తరిస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. విందులు, వినోదాల్లో కొవిడ్​ నిబంధనలు పాటించకపోవడం వల్ల కరోనా పెద్ద ఎత్తున వ్యాపిస్తుందని చెబుతున్నారు.

80 శాతం మందిలో లక్షణాలు లేవు

గ్రేటర్‌ పరిధిలో 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది అత్యధికంగా శనివారం జీహెచ్‌ఎంసీలో 743 మంది వైరస్‌ బారిన పడ్డారు. ప్రభుత్వ ఐసోలేషన్‌ కేంద్రాలు బాధితులతో నిండిపోతున్నాయి. 21-40 ఏళ్లలోపు వారే 60 శాతానికి పైగా ఉంటున్నారు. 80 శాతం మందిలో ఎటువంటి లక్షణాలు కనిపించట్లేదు. మరో రెండు, మూడ్రోజులపాటు ఇదే తీవ్రత కొనసాగితే పడకలు దొరకటం కష్టమని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి సైతం అత్యవసర వైద్యం కోసం నగరానికి కొవిడ్‌ రోగులు వస్తున్నారు. అత్యవసరమైతే ఇంటి వద్దనే సేవలు అందించేందుకు వైద్య బృందాలు సిద్ధమవుతున్నాయి. కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో పడక కోసం పైస్థాయిలో పైరవీలు చేయించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

సిబ్బంది సైతం..

కొవిడ్‌ వైద్యపరీక్షలు నిర్వహిస్తున్న సిబ్బంది అధికశాతం కరోనా బారిన పడుతున్నారు. కరోనా రెండో దశ తీవ్రత ఎక్కువగా ఉండటంతో కొన్ని పరీక్ష కేంద్రాల్లోని సాంకేతిక సిబ్బంది సెలవుపై వెళ్తున్నారు. పరీక్షలకు వస్తున్న వారి సంఖ్య వారంలో రెండు/మూడు రెట్లు పెరిగినట్లు ఓ డయాగ్నస్టిక్‌ కేంద్ర ప్రతినిధి తెలిపారు. తమ ఆసుపత్రిలో రోజూ శాంపిల్స్‌ తీసుకునే సామర్థ్యం 150 వరకూ ఉంటే ప్రస్తుతం 450-500 మంది వరకూ వస్తున్నట్టు చెప్పారు. సిబ్బంది తగ్గటం, పనిభారం పెరగటంతో ఇంటికెళ్లి శాంపిల్స్‌ సేకరించటం సవాల్‌గా మారిందంటున్నారు. సామర్థ్యాన్ని మించి నమూనాలు రావటంతో నివేదికలు పంపేందుకు సగటున 4-5 రోజులు పడుతోంది. ఇతర అనారోగ్య సమస్యలున్న వారిలో నివేదిక వచ్చేలోపు వ్యాధి తీవ్రత పెరుగుతుంది. శ్వాస అందని పరిస్థితుల్లో ఐసీయూలో చేరాల్చి వస్తోందని స్పష్టం చేస్తున్నారు.

నిర్లక్ష్యం వద్దు

కరోనా పరీక్షల నివేదిక ఆలస్యం కావటం, లక్షణాల్లేవని చాలామంది తేలికగా తీసుకుంటున్నారు. ఇలాంటి వారి ద్వారా కుటుంబ సభ్యులకు తేలికగా వ్యాపిస్తోందని వైద్యులు విశ్లేషిస్తున్నారు. ఆసుపత్రులకు వస్తున్న 30- 40 శాతం కేసుల తీవ్రతకు నివేదిక జాప్యమే కారణమంటున్నారు. నివేదిక వచ్చేంత వరకూ ఆగకుండా దగ్గు, జ్వరం, ఛాతీ పట్టేయటం, శ్వాస సమస్యలు, ఆక్సిజన్‌ స్థాయి తగ్గటం ఇలా ఏ ఒక్కటి ఉన్నా ఆసుపత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు.

ఇదీ చూడండి :అడ్డసరం మొక్కలో.. కరోనా ప్రభావం తగ్గించే జన్యువులు

ABOUT THE AUTHOR

...view details