పీఆర్సీకి 8వేల కోట్లు... సీఎం ప్రకటన తర్వాత నిధులపై స్పష్టత ఉద్యోగుల వేతన సవరణ అంశాన్ని బడ్జెట్ ప్రసంగంలో ప్రభుత్వం ఎక్కడా ప్రస్తావించలేదు. బడ్జెట్ పుస్తకాల్లోనూ ఎక్కడా పేర్కొనలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు మంచి వేతన సవరణ ఇస్తామని రెండు, మూడు రోజుల్లో తానే స్వయంగా ప్రకటన చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ వేదికగా తెలిపారు. సీఎం ప్రకటన చేయనున్న నేపథ్యంలో పీఆర్సీ అంశాన్ని ప్రస్తావించకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
పేరు లేకుండా నిధులు!
వార్షిక పద్దులో నిధులు కేటాయించకుండా ప్రకటన చేసినా ఫలితం ఉండదన్న ఉద్దేశంతో పీఆర్సీ పేరు లేకుండా నిధులు కేటాయించారు. ఆర్థికశాఖకు కేటాయించిన రూ. 45వేల కోట్లలోనే పీఆర్సీ అమలుచేస్తే అయ్యే భారాన్ని పొందుపరిచారు. ఆర్థికశాఖ నిర్వహణ వ్యయంలో సచివాలయ సాధారణ సర్వీసులు అనే విభాగాన్ని కొత్తగా చేర్చారు. ఆ విభాగానికి రూ. 8వేల కోట్లు కేటాయించారు. ఈ విభాగం గతంలో లేదు. అది కూడా ఈసారి ఏకమొత్తంగా నిధులు కేటాయించడంతో ఉద్యోగుల వేతన సవరణ కోసమే ఆ మొత్తాన్ని విడిగా కేటాయించినట్లు సమాచారం.
అదనపు భారం...
ఇదే సమయంలో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 61 ఏళ్లకు పెంచితే రూ. 2,500 నుంచి రూ. 3,000 కోట్ల వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాయిదా పడతాయి. ఆ మొత్తాన్ని పీఆర్సీ అమలు కోసం వినియోగించవచ్చని అంటున్నారు. ఉద్యోగులకు ఒకశాతం వేతన సవరణ చేస్తే ఏడాదికి రూ. 303 కోట్ల అదనపు భారం ఖజానాపై పడుతుందని ఆర్థికశాఖ ఇప్పటికే అంచనా లేసింది.
సీఎం ప్రకటన తర్వాత...
ప్రస్తుతం సచివాలయ సాధారణ సర్వీసుల కింద కేటాయించిన రూ. 8,000 కోట్లు, వాయిదా పడే పదవీ విరమణ బెనిఫిట్స్ కలిపితే ఐదంకెల సంఖ్య అవుతుందని... దాంతో మంచి వేతన సవరణ వస్తుందని అంచనా. ఆంధ్రప్రదేశ్ కంటే ఒకటి, రెండు శాతం.... ఎక్కువగానే పీఆర్సీ ఇస్తారని ఉద్యోగ సంఘాల నేతలు ఇటీవల ముఖ్యమంత్రితో చర్చల అనంతరం ప్రకటించారు. ఆ హామీకి అనుగుణంగానే బడ్జెట్‌లో నిధులు కేటాయించినట్లు కనిపిస్తుంది. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన చేస్తే అందుదుకు సంబంధించి పూర్తి స్పష్టత వస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి :'అంకెలు బారెడు... అప్పులు బోలెడు'