77th Independence Day Celebrations in Hyderabad: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర అధికార పార్టీ బీఆర్ఎస్ మంత్రులు, రాజకీయ నేతలు, పలు ప్రముఖులు జెండా ఎగురవేసి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలను తెలిపారు. అసెంబ్లీ, శాసన మండలిలో స్వాతంత్య్ర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ముందుగా ప్రగతిభవన్‌లో జాతీయ జెండా ఎగరేసిన సీఎం కేసీఆర్.. అనంతరం.. సికింద్రాబాద్ పరేడ్ మైనంలోని అమరజవాన్ల స్థూపం వద్ద నివాళుర్పించారు.
CM KCR Flag Hoisting: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని.. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం.. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో అమర సైనికులకు.. ముఖ్యమంత్రి నివాళులర్పించారు. అమరజవాన్ల స్థూపం వద్ద సీఎం కేసీఆర్ శ్రద్ధాంజలి ఘటించి.. రెండు నిమిషాలు మౌనం పాటించారు. అంతకుముందు పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్న ముఖ్యమంత్రికి.. పోలీసులు ఘనంగా స్వాగతం పలికారు. అసెంబ్లీలో జాతిపిత గాంధీజీ, అంబేడ్కర్ విగ్రహాల వద్ద నివాళులర్పించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
తెలంగాణ పరిపాలన దేశానికే దిక్సూచి..:అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. ఎందరో సమరయోధుల త్యాగ ఫలాల వల్లే స్వాతంత్రం సిద్ధించిందని స్పీకర్ తెలిపారు. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు.. ప్రత్యేక తెలంగాణ రావాలని ఆకాంక్షించారు కాబట్టే తెలంగాణ ఏర్పాటైందని చెప్పారు. తెలంగాణ పరిపాలన దేశానికే దిక్సూచిగా నిలించిందన్నారు. పంట పండించే విస్తీర్ణం, జీఎస్టీ, రైతన్నలకు అందిస్తున్న రుణమాఫీ, రైతు బంధు, కల్యాణ లక్ష్మి వంటి అనేక సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ ముందుందని పేర్కొన్నారు.
ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు(Large Scale Welfare Programs in Telangana) అమలవుతున్నాయన్నారు. జాతిపిత గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మువ్వన్నెల జెండాను ఎగురేశారు. దేశ ప్రజలకు కూడా ఈ తరహా సంక్షేమ కార్యక్రమాలు అందాలని కోరుకున్నారు. దేశ ప్రజల సౌభాగ్యం కోసం రాజకీయ పార్టీల నేతలు పని చేయాలని.. పరస్పర విమర్శలు మానుకొని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని విజ్ఞప్తి చేశారు.
Rythu Runamafi Telangana 2023 : అన్నదాతలకు పంద్రాగస్టు కానుక.. రూ.99,999 లోపు రైతు రుణాలన్నీ మాఫీ
దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ..:స్వాతంత్య్ర దినోత్సవ వేడుకుల్లో భాగంగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి.. బోయిన్‌పల్లిలోని తన కార్యాలయంలో జెండా ఎగురవేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ దేశంలో సరైన అభివృద్ధి జరగలేదని మంత్రి విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన దశాబ్ది కాలంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్.. దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో తెలంగాణనునిలిపారని కొనియాడారు. తెలంగాణలో మాదిరిగా దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందించేలా దేశ నాయకత్వం పని చేయాలని.. తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసం వద్ద జాతీయ పతాకాన్ని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎగురవేశారు. ఎంతోమంది అమరుల త్యాగఫలం మూలంగా స్వాతంత్య్రం సిద్ధించిందని మంత్రి గుర్తు చేశారు.