రాష్ట్ర రాజధానిలో నిత్యం 700-800 మధ్య కరోనా కేసులు నమోదవుతున్నాయి. పౌరులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా, మాస్కు లేకుండా గుంపుల్లో తిరిగినా వైరస్ విజృంభించే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఆదివారం గ్రేటర్‌లో 557 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 111, మేడ్చల్‌లో 87 మందికి కరోనా సోకింది. అంబర్‌పేట సర్కిల్‌లో 60 కేసులు నమోదయ్యాయి.
బాధితుల్లో బస్తీవాసులు ఎక్కువగా ఉన్నారు. ఉప్పల్ పరిధిలో 18 మంది, కాప్రా సర్కిల్‌లో ఆరుగురు కరోనా బారినపడ్డారు. మల్కాజిగిరి సర్కిల్‌లో ఆదివారం పరీక్షలు నిర్వహించలేదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో 41 మందికి వైరస్ సోకింది. కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, మూసాపేట, సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్, సంతోష్‌నగర్ సర్కిళ్ల పరిధిలోనూ బాధితులు పెద్దసంఖ్యలో ఉన్నారు.
ఊరెళ్లిపోయామంటూ...
నగరంలో పరీక్షలు చేయించుకున్న కొంతమంది ఫలితాలు రాకముందే ఊరెళ్లిపోవడం వంటివి తమ దృష్టికి వచ్చాయని బల్దియా చెబుతోంది. ఫోన్ నంబర్లను సంప్రదిస్తే చాలామంది నుంచి ఈ జవాబు వచ్చిందన్నారు. గుర్తించలేని 2వేల కేసుల్లో ఆ కోవకు చెందినవారు 20శాతం ఉంటారని అంచనా. ఎక్కువ శాతం ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందినవారు జాబితాలో ఉన్నారు.