తెలంగాణ

telangana

ETV Bharat / state

Nationwide Survey: అభ్యసన సామర్థ్యాలపై దేశవ్యాప్త సర్వే.. తెలంగాణ నుంచి 4,936 పాఠశాలల ఎంపిక

అభ్యసన సామర్థ్యాలపై దేశవ్యాప్త సర్వే( nationwide survey on learning abilities) నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ నెల 12న నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ నుంచి 4,936, ఏపీలో 2,912 పాఠశాలల నుంచి విద్యార్థులు ఈ సర్వేలో పాల్గొననున్నారు.

Nationwide Survey
Nationwide Survey

By

Published : Nov 8, 2021, 6:45 AM IST

దేశవ్యాప్తంగా పాఠశాలల విద్యార్థుల్లో అభ్యసన సామర్ధ్యాలను ( nationwide survey on learning abilities ) అంచనా వేసేందుకు ఈనెల 12న జాతీయ సాధన సర్వే (న్యాస్‌) కింద పరీక్షలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మొత్తం 38.87 లక్షల మంది 3, 5, 8, 10 తరగతుల విద్యార్థులకు వివిధ సబ్జెక్టుల్లో కనీస పరిజ్ఞానాన్ని పరీక్షించనుంది. ఈసారి ప్రభుత్వ, ఎయిడెడ్‌తో పాటు ప్రైవేట్‌ పాఠశాలలను కూడా ఎంపిక చేశారు. తెలంగాణ నుంచి 4,936, ఏపీలో 2,912 పాఠశాలల నుంచి విద్యార్థులు ఈ సర్వేలో పాల్గొననున్నారు. ఎంపికైన పాఠశాలలో ఒక్కో తరగతి నుంచి 30 మంది ఈ సర్వేలో పాల్గొంటారు. మూడు, నాలుగు తరగతులకు మాతృభాష, గణితం, ఈవీఎస్‌, 8, 10 తరగతులకు మాతృభాష, గణితం, సోషల్‌, సైన్స్‌ ఆంగ్లం సబ్జెక్టుల్లో పరీక్షలు జరుపుతారు. బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు ఉండే ప్రశ్నపత్రాలు ఇస్తారు. మూడు, అయిదు తరగతులకు గంటన్నర, మిగిలిన తరగతులకు రెండు గంటల చొప్పున సమయం ఇవ్వనున్నారు. ఓఎంఆర్‌ పత్రంలో జవాబులు గుర్తించాలి. సర్వే అనంతరం రాష్ట్రాలు, జిల్లాల వారీగా కేంద్రం సమగ్ర నివేదికలను విడుదల చేస్తోంది. ఏ రాష్ట్రంలో, ఏ జిల్లాలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు ఎలా ఉన్నాయో అందులో పొందుపరుస్తారు. ఏ సబ్జెక్టులో, ఏ అంశాల్లో విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందో నివేదికలు ఇస్తారు. ఆ ప్రకారం వచ్చే విద్యా సంవత్సరం పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

  • పరీక్షలను పకడ్బందీగా నియమించేందుకు సీబీఎస్‌ఈ ఇప్పటికే పరిశీలకులను నియమించింది. తెలంగాణకు 53 మంది, ఏపీకి 14 మందిని నియమిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణ అధికారులను, ఇన్విజిలేటర్లను నియమించారు. ఈసారి పరిశీలకులుగా ఇతర రాష్ట్రాల వారిని నియమించడం గమనార్హం.
  • పరీక్ష సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు ప్రశ్నావళి ఇచ్చి పలు అంశాలపై సమాధానాలను కేంద్రం తీసుకోనుంది. విద్యార్థులకు మౌఖికంగా పలు ప్రశ్నలు వేసి జవాబులు రాబడతారు. ప్రధానోపాధ్యాయులు కూడా 73 ప్రశ్నలకు సమాధానమివ్వాలి.

ABOUT THE AUTHOR

...view details