కరోనాను జయించాడు ఓ బుడతడు. 19 రోజులపాటు వైరస్‌తో పోరాటం చేసి విజయం సాధించాడు. అత్యంత పిన్న వయసున్న బాబుకు సమర్థంగా చికిత్స అందించినందకు గాంధీ ఆసుపత్రి వైద్యులను మంత్రి ఈటల రాజేందర్ అభినందించారు.
జయించాడు
దిల్లీ నుంచి వచ్చిన మహబూబ్‌నగర్ వాసికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఏప్రిల్10న అతడి బిడ్డ నుంచి సైతం శాంపిళ్లు సేకరించారు.అప్పటికే ఆ పసికందు విరేచనాలు, జ్వరంతో బాధపడుతున్నాడు. చివరికి వైరస్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో 25 రోజుల బిడ్డను గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. చికిత్సకు ఎలా ముందుకెళ్లాలో చర్చించి వైౖద్యులంతా అప్రమత్తమయ్యారు. చిన్న పిల్లల డాక్టర్లు నిరంతరం పర్యవేక్షించారు. ఔషధాలు అందించారు. జ్వరం, విరేచనాలు తగ్గి క్రమంగా ఆరోగ్యం మెరుగుపడింది. ఏ దశలోనూ వెంటిలేటర్ అవసరం రాలేదని గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. ఇటీవల 75, 78 ఏళ్ల వయసున్న ఇద్దరు వృద్ధులు కూడా గాంధీ ఆసుపత్రిలో కోలుకున్న సంగతి తెలిసిందే.