TS Eamcet counselling 2021: ఎంసెట్ తుది విడత సీట్లు ఎన్నంటే? - తెలంగాణ వార్తలు
ఎంసెట్ తుది విడత కౌన్సిలింగ్(TS Eamcet counselling 2021) ప్రారంభమైంది. మొత్తం 39వేల సీట్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. తొలి విడత మిగిలిన సీట్లతో పాటు... కొత్తగా మరో 4,404 సీట్లు అదనంగా చేరాయి. ఈనెల 8న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది.
ఎంసెట్ తుది విడత సీట్లు, తెలంగాణ ఎంసెట్ 2021 కౌన్సిలింగ్
By
Published : Nov 7, 2021, 8:06 AM IST
ఎంసెట్ చివరి విడత కౌన్సెలింగ్‌లో(TS Eamcet counselling 2021) మొత్తం 39వేల సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. తొలివిడతలో భారీగా సీట్లు మిగిలిపోగా.. కొత్తగా మరో 4,404 అదనంగా చేరాయి. వాటికి ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లు 10శాతం కలుస్తాయి. చివరి విడత కౌన్సెలింగ్ శనివారం మొదలైంది. తొలిరోజు 1481 మంది ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్లు బుక్ చేసుకున్నారు. ఆ రుసుం చెల్లించేందుకు ఆదివారం వరకు గడువుంది. వారందరికీ 8న ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు.
సీట్లు రద్దు చేసుకున్నవారు 3800 మంది
మొదటి విడతలో 61,169 మందికి సీట్లు దక్కినా 46,300 మందే ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. అందులోనూ సుమారు 3,800 మంది సీట్లు రద్దు చేసుకున్నారు. వారంతా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో సీట్లు వచ్చిన వారితోపాటు యాజమాన్య కోటాలో చేరినవారే. అంటే ఇక నికరంగా మిగిలింది 42,500 మందే. తొలివిడతలో సీట్లు దక్కినవారు చివరి విడత కౌన్సెలింగ్‌లో మెరుగైన కళాశాల, బ్రాంచి కోసం పోటీపడతారని, మొత్తానికి మరో 10వేల మంది సీట్లు పొందవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంటర్‌లో అందరూ పాస్ కావడం, ఇంజినీరింగ్‌లో డిమాండున్న కంప్యూటర్ సైన్స్, సంబంధిత బ్రాంచీల్లో సీట్లు పెరగడం వల్ల ఈసారి యాజమాన్య కోటా కలుపుకొని ప్రవేశాల సంఖ్య దాదాపు 75 వేలకు చేరుకోవచ్చని భావిస్తున్నారు.
ఎంసెట్ ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభమైంది(Engineering Final Counselling 2021). ధ్రువపత్రాల పరిశీలన కోసం ఆన్‌లైన్‌లో రుసుము చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఈనెల 8న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. నేటి నుంచి ఈనెల 9 వరకు వెబ్‌ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుంది. ఈనెల 12న తుది విడత ఇంజినీరింగ్ సీట్లను కేటాయిస్తారు. ఈనెల 12 నుంచి 15 వరకు ఆన్‌లైన్‌లో బోధన రుసుము చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. తుది విడతలో వచ్చిన సీటును రద్దు చేసుకునేందుకు ఈనెల 18 వరకు అవకాశం ఉంటుంది.
ఈనెల 20 నుంచి ప్రత్యేక విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈనెల 20, 21 తేదీల్లో వెబ్ఆప్షన్లకు అవకాశం ఇచ్చి.. ఈనెల 24న సీట్లను కేటాయిస్తారు. ఈనెల 24 నుంచి 26 వరకు వెబ్సైట్ ద్వారా బోధన రుసుము చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడంతో పాటు.. కాలేజీకి వచ్చి చేరాల్సి ఉంటుంది. ప్రత్యేక రౌండులో వచ్చిన సీటును రద్దు చేసుకునేందుకు ఈనెల 26 వరకు అవకాశం ఉంటుంది. స్పాట్ అడ్మిషన్ల కోసం ఈనెల 25న మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు నవీన్ మిత్తల్ తెలిపారు. తుది విడత కౌన్సెలింగ్ కోసం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 5 వేల రూపాయలు.. మిగతా అభ్యర్థులు 10వేల రూపాయలు చెల్లించాలని పేర్కొన్నారు. కాలేజీలో చేరిన తర్వాత ఆ సొమ్ము తిరిగి చెల్లిస్తారు.