Southern Zonal Council meeting : దక్షిణాది జోనల్ కౌన్సిల్ తదుపరి సమావేశం ఎజెండా ఖరారు కోసం ఈ నెల 5వ తేదీన స్థాయి సంఘం సమావేశం కానుంది. చెన్నై వేదికగా జరగనున్న ఈ భేటీలో తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ కు చెందిన అధికారులు, కేంద్ర హోంశాఖ అధికారులు సమావేశంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఈ భేటీలో ప్రస్తావించాల్సిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అంతర్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం నదీ జలాల కేటాయింపు కోసం చర్యలు, బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు, నీటి పారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా, తదితర అంశాలను జోనల్ కౌన్సిల్‌లో మరోమారు ప్రస్తావించేందుకు రాష్ట్ర సర్కార్ సిద్దమవుతోంది.
Southern Zonal Council meeting news : 2022 సెప్టెంబర్ మూడో తేదీన తిరువనంతపురంలో జరిగిన 30 వ జోనల్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు స్థితితో పాటు చెన్నై వేదికగా జరగనున్న తదుపరి కౌన్సిల్ సమావేశం ఎజెండాలో పొందుపరచాల్సిన అంశాలపై స్థాయి సంఘం సమావేశంలో చర్చిస్తారు. జోనల్ కౌన్సిల్ సమావేశం కోసం కేంద్ర ప్రభుత్వం లోని వివిధ శాఖలతో పాటు ఆయా రాష్ట్రాలు ఇప్పటికే 48 అంశాలను ప్రతిపాదించాయి.