తెలంగాణ

telangana

ETV Bharat / state

రుణాలు సేకరించి ప్రాజెక్టులు కట్టాం.. నిధులివ్వండి: హరీశ్ - 15వ ఆర్థిక సంఘాన్ని నిధులు కోరనున్న ప్రభుత్వం

కాళేశ్వరం ప్రాజెక్ట్ సహా మిషన్ భగీరథ కోసం నిధులు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. రుణాల సాయంతో రెండింటిని పూర్తి చేసినందున నిర్వహణా వ్యయం కోసం నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయనుంది. 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్​తో దిల్లీలో సమావేశం కానున్న ఆర్థిక మంత్రి హరీశ్​రావు ఈ మేరకు ప్రతిపాదనలను ముందుంచనున్నారు.

15th finance commission meeting today in Delhi
రుణాలు సేకరించి ప్రాజెక్టులు కట్టాం

By

Published : Jan 28, 2020, 7:24 AM IST

Updated : Jan 28, 2020, 7:30 AM IST

రానున్న ఐదేళ్ల కోసం రాష్ట్రాలకు కేంద్రం ఇవ్వాల్సిన నిధులకు సంబంధించి ఏర్పాటు చేసిన 15వ ఆర్థిక సంఘం కాలపరిమితిని పొడిగించారు. నివేదిక సమర్పించే ముందు ఆర్థిక సంఘం మరింతగా కసరత్తు చేయనుంది. రాష్ట్ర అవసరాలు, అభిప్రాయాలను గతంలోనే 15వ ఆర్థిక సంఘం ముందు ఉంచిన ప్రభుత్వం... మరోమారు వాటిని వారి దృష్టికి తీసుకెళ్లనుంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీశ్​రావు ఇవాళ దిల్లీలో ఆర్థికసంఘం ఛైర్మన్ ఎన్​కే సింగ్​తో సమావేశం కానున్నారు. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కూడా మంత్రితో పాటు సమావేశంలో పాల్గొననున్నారు.

రుణాల రూపంలో నిధులు..

కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధుల శాతం పెంపు, రుణపరిమితి పెంపు సహా మౌలిక వసతులకు నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే కేంద్ర ఆర్థిక సంఘాన్ని కోరింది. తాజాగా మరోమారు రాష్ట్ర ప్రతిపాదనలను ప్రస్తావించనున్నారు. వీటితో పాటు కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్, మిషన్ భగీరథకు నిధులు ఇవ్వాలని కోరనున్నారు. 530 టీఎంసీల నీరు తీసుకునేలా లక్షకోట్లకు పైగా అంచనా వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్ట్​ను చేపట్టి రికార్డు స్థాయిలో పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం నిధులను రుణాల రూపంలో సమకూర్చుకొంది.

నిధులివ్వండి..

ప్రతి ఇంటికి శుద్ధి చేసిన నదీజలాలను అందించాలనే లక్ష్యంతో మిషన్ భగీరథ ప్రాజెక్ట్​ను చేపట్టి పూర్తి చేసింది తెలంగాణ సర్కారు. తుదిదశలో కొన్ని పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్​కు అవసరమైన నిధులను కూడా రుణాల ద్వారానే సమకూర్చారు. మిషన్ భగీరథ రుణాల చెల్లింపులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ రెండు ప్రాజెక్ట్​ల కోసం నిధులు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది.

కేంద్రమే భరించాలి..

రెండు ప్రాజెక్ట్​ల నిర్వహణా వ్యయాన్ని కేంద్రం భరించాలని... ఈ మేరకు అవసరమైన నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేయనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖను ఆర్థిక సంఘం ఛైర్మన్​ ఎన్.కె.సింగ్​కు ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు అందించనున్నారు. మిషన్ భగీరథ కోసం 19వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని నీతిఆయోగ్ గతంలో చేసిన సిఫారసులను కూడా కమిటీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా 'హర్ ఘర్ కో పానీ' కార్యక్రమాన్ని చేపడుతున్న నేపథ్యంలో ఆ నిధులను రాష్ట్రంలో మిషన్ భగీరథ నిర్వహణ కోసం ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘాన్ని కోరనున్నారు. వీటితో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఇతర అవసరాలు, స్థానిక సంస్థలకు నిధుల అంశాలను కూడా వారి దృష్టికి తీసుకెళ్లనున్నారు.

ఇవీ చూడండి: నేరేడుచర్లలో నేడైనా.. జరిగేనా ఎన్నిక...

Last Updated : Jan 28, 2020, 7:30 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details