రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా లాక్‌డౌన్ అమలవుతోంది. ఉదయం 10 గంటల తర్వాత ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. నగరాలు, పట్టణాల్లోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమించి రోడ్లపై తిరిగేవారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత దాదాపు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.
కఠినంగా అమలు
కరోనా కట్టడికి అమలు చేసిన లాక్‌డౌన్ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. అధికశాతం ప్రజలు ఉదయం 10 గంటల తర్వాత ఇళ్లకే పరిమితంకాగా... నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చేవారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. వాహనాలను సీజ్ చేస్తున్నారు. హైదరాబాద్ ఏంజె మార్కెట్‌లో 10 తర్వాత జనాలు ఎక్కువగా ఉండడంతో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. కేసులు నమోదు చేయడంతోపాటు నిబంధనలు అతిక్రమించినందుకు వాహనాలు జప్తు చేశారు. కొంతమంది పోలీసులతో వాగ్వావాదానికి దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. కొంపల్లిలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నప్పుడు మేడ్చల్ జాతీయ రహదారిపై రద్దీ ఏర్పడింది. అంబులెన్సులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక దారి ఏర్పాటు చేసి సాధారణ వాహనాలన్నీ ఒకే వరసలో వచ్చేలా చర్యలు తీసుకున్నారు. మీర్‌పేట్, బాలాపూర్ పరిధిలోని చెక్‌పోస్టులను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పరిశీలించారు. కరోనా కట్టడికి కృషి చేస్తున్న పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు.