తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎన్నికల వేళ రెట్టింపైన మద్యం అమ్మకాలు - liquor

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. కేవలం ఏప్రిల్​ మొదటి తొమ్మిది రోజుల్లో సాధారణం కన్నా రెట్టింపు విక్రయాలు జరగడమే ఇందుకు నిదర్శనం.

రెట్టింపైన మద్యం అమ్మకాలు

By

Published : Apr 11, 2019, 5:39 AM IST

రెట్టింపైన మద్యం అమ్మకాలు

తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా...ఏప్రిల్‌ నెల మొదటి తొమ్మిది రోజుల్లో రెట్టింపు మద్యం విక్రయాలు జరిగాయి. నిన్న, నేడు 48 గంటల పాటు మద్యం దుకాణాలు బంద్‌ ఉండడంతో రాజకీయ పార్టీలు ముందస్తుగా పెద్ద మొత్తంలో మద్యం కొనుగోలు చేయడం ద్వారానే అమ్మకాలు పెరిగినట్లు ఎక్సైజ్‌ శాఖ అంచనా వేస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు రూ.6000 కోట్లు విలువైన మద్యాన్ని మంచినీళ్లలా తాగేశారు మందు బాబులు.

గతేడాది ఏప్రిల్‌ నెలలో మొదటి తొమ్మిది రోజుల్లో జరిగిన మద్యం విక్రయాలు రూ.278 కోట్లు కాగా.... ఈ నెల మొదటి తొమ్మిది రోజుల్లో...దీని విలువ రూ.538 కోట్లకు చేరుకుంది. గతేడాది అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది దాదాపు రెట్టింపు అమ్మకాలు జరిగినట్లు చెప్పొచ్చు.

రంగారెడ్డి జిల్లాలోనే అధికం...

మద్యం విక్రయాలు అధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ.68 కోట్లు, హైదరాబాద్‌ జిల్లా పరిధిలో రూ.60 కోట్లు, మేడ్చల్‌ జిల్లా పరిధిలో రూ.54 కోట్లు వరకు జరిగాయి. మిగిలిన జిల్లాల్లో కూడా సాధారణ అమ్మకాల కంటే ఎక్కువ జరిగినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ప్రచారం ముగిసిన తర్వాత పోలింగ్​ అయ్యేంత వరకు 48 గంటల పాటు మద్యం దుకాణాలకు బంద్​ ఉంది. దీంతో ముందస్తుగా రాజకీయ పార్టీలు మద్యాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నట్లు ఎక్సైజ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే రూ. 6వేల కోట్ల విక్రయాలు..

ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్​ 9వ తేది వరకు జరిగిన మద్యం విక్రయాలు గతేడాదితో పోలిస్తే అధికం అయ్యాయి. సార్వత్రిక ఎన్నికలే అందుకు కారణమని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ తొమ్మిది వరకు జరిగిన మద్యం విక్రయాలు ఏకంగా ఆరువేల కోట్లకు మించి జరిగినట్లు అబ్కారీ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. గతేడాది ఇదే సమయంలో జరిగిన అమ్మకాలతో పోలిస్తే దాదాపు రూ.1200 కోట్లుకుపైగా అధికం.

రాష్ట్రంలో 2,216 మద్యం దుకాణాలు, 1023 బార్లు, 33 క్లబ్‌ల ద్వారా మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ తొమ్మిదో తేది వరకు రూ.6వేల కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి.

జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలలపాటు జరిగిన మద్యం విక్రయాలను పరిశీలించినట్లయితే జనవరిలో రూ.1880 కోట్లు, ఫిబ్రవరిలో రూ.1761 కోట్లు, మార్చి రూ.1743 కోట్లు, ఏప్రిల్‌ నెల 9రోజుల్లో రూ.538 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగాయి. దుకాణాల నుంచి పెద్దమొత్తంలో కొనుగోలుపై నిబంధనలు విధించడంతో కొందరు నేరుగా డిస్ట్రిలరీల నుంచే తెప్పించుకునే ప్రయత్నం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గుడుంబా తయారీ కేంద్రాలు కూడా పెరిగినట్లు తెలుస్తోంది. రెండు లోడ్లు మద్యం దొరకడంతో మరింత నిఘా పెంచారు. ఈ ఎన్నికల్లో కూడా మద్యం ఏరులై పారే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు సున్నితమైన ప్రదేశాల్లో నిఘా మరింత పెంచారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

ఇవీ చూడండి:మల్కాజిగిరి ఎన్నికకు సర్వం సిద్ధం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details