టెలికాం ఆపరేటర్ 'వొడాఫోన్-ఐడియా' 2018-19 మూడవ త్రైమాసికంలో రూ.5000.7 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది.
గతేడాది ఇదే సమయానికి వొడాఫోన్-ఐడియా రూ.1,284.5 కోట్ల నష్టం నమోదుచేసింది. అయితే... 2018 ఆగష్టు 31 వరకు వొడాఫోన్, ఐడియా విలీనం పూర్తి కానందున... ఈ గణాంకాల్ని పోల్చిచూడలేము.
అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో వొడాఫోన్-ఐడియా మొత్తం ఆదాయం రూ.11,982.8 కోట్లుగా ఉంది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంతో పాల్చితే 52 శాతం వృద్ధి సాధించినట్లు లెక్క. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ ఉమ్మడి సంస్థ రూ.7,878.6 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో రూ.6,551.6 కోట్ల ఆదాయం పొందింది.
"మేము తీసుకున్న చర్యలు ఈ త్రైమాసికం చివరి నాటికి సానుకూల ఫలితాలను చూపించడం ప్రారంభించాయి. మేము అనుకున్నదాని కంటే చాలా వేగంగా నెట్వర్క్ అనుసంధానం పూర్తిచేశాం. మా సినర్జీ లక్ష్యాలను సాధించడానికి సిద్ధంగా ఉన్నాం.
కీలక స్థానాల్లో బలపడడంపై దృష్టిసారించాం. 4జీ నెట్వర్క్ కవరేజ్, సామర్థ్యం విస్తరిస్తాం. కొత్త 4జీ వినియోగదారులను పొందడమే లక్ష్యంగా సేవలు విస్తరించనున్నాం. ఈ త్రైమాసికంలో మా పెట్టుబడుల పెంచి మా వ్యూహాత్మక లక్ష్యాల సాధనకు కృషి చేస్తున్నాం. "
- బాలేశ్ శర్మ, వొడాఫోన్-ఐడియా సీఈఓ