రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. సర్పంచులు, వార్డు సభ్యులుగా బాధ్యతలు స్వీకరించారు. పంచాయతీ కార్యదర్శులు.. పాలకవర్గాల తొలి సమావేశాన్ని నిర్వహించారు. మూడు విడతలుగా జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 12,680 పంచాయతీలకు పాలకులు ఎన్నికయ్యారు.
నిర్మల్ జిల్లాలోని గ్రామపంచాయతీల్లో నూతన పాలకవర్గం కొలువుదీరింది. కొత్త సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్లపల్లి గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నికైన రవీందర్‌రెడ్డి ప్రమాణ స్వీకారానికి మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హాజరయ్యారు. నూతన పాలకవర్గం గ్రామాభివృద్ధికి పాటుపడాలని కోరారు.
ఖమ్మం జిల్లాలో మండల అధికారులు నూతనంగా ఎంపికైన పంచాయతీ పాలకుల చేత ప్రమాణం చేయించారు. ఏన్కూరు, జూలూరుపాడు, కొనిజర్ల, కారేపల్లి మండలాల్లో జనసందోహం మధ్య ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఏనుకూరులో సర్పంచ్‌గా ఎన్నికైన చిర్రా రుక్మిణి వెంకన్న దంపతులు మొక్కులు తీర్చుకునేందుకు భద్రాచలం వరకు పాదయాత్రగా వెళ్లారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో కొత్త పాలకవర్గాలు ఈరోజు బాధ్యతలు చేపట్టారు. మోత్కూరు మండలం దాచారం గ్రామ సర్పంచ్ రజితను ఓడిపోయిన అభ్యర్థి శాలువాతో సన్మానించారు. గ్రామాభివృద్ధికి కృషి చేయాలని, తమ సాయం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన మొట్టమొదటి పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేసి.. స్వచ్ఛతపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి పాటుపడతామని వాగ్దానం చేశారు.