తెలంగాణ

telangana

ETV Bharat / state

పుష్కరం తర్వాత.. కుటుంబసభ్యుల చెంతకు!

మతిస్థిమితం కోల్పోయిన బామ్మ... 12 ఏళ్ల క్రితం ఇల్లు విడిచి వెళ్లిపోయింది. ఎక్కడికెళ్లిందో తెలియదు. ఎలా ఉందో తెలియదు. 8 ఏళ్ల పాటు.. వెతికీ వెతికీ కుటుంబసభ్యలూ ఆమెపై ఆశలు వదులుకున్నారు. కానీ.. తప్పిపోయిన పుష్కరం తర్వాత ఆ వృద్ధురాలి రాత మారింది. తెలంగాణలో తప్పిపోయి.. ఆంధ్రాకు చేరిన ఆమెను.. ఓ స్వచ్ఛంద సేవా కార్యకర్త.. సామాజిక మాధ్యమాల సహాయంతో.. అయినవాళ్లచెంతకు చేర్చారు.

By

Published : Jun 3, 2019, 5:45 PM IST

పుష్కరం తర్వాత.. కుటుంబసభ్యుల చెంతకు!

తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ నగరంలోని ఎస్​ఆర్​ఆర్​తోట ప్రాంతానికి చెందిన 80 ఏళ్ల ఉప్పమ్మ.. మతిస్థిమితం సరిగ్గా లేక 12 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఆమెకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఎనిమిదేళ్ల పాటు కుటుంబసభ్యులు ఆమె ఆచూకీ కోసం వెతికినా జాడ తెలియలేదు. అప్పటి నుంచి భిక్షాటన చేస్తూ ఎక్కడెక్కడో తిరిగిన ఆమె ఇటీవలే కృష్ణా జిల్లా నందిగామ చేరారు. కొన్నాళ్ల నుంచి స్థానిక బస్టాండ్‌లో ఉంటున్నారు.

చలించిపోయి... చేరదీసింది

ఉప్పమ్మ దయనీయ స్థితిని చూసి వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేటకు చెందిన అమ్మ అనాథ, వృద్ధాశ్రమ నిర్వాహకురాలు శ్రీదేవి చలించిపోయారు. విజయవాడ వైపు బస్సులో వెళ్తుండగా ఉప్పమ్మను చూసి వెంటనే బస్సు దిగి ఆమె జుట్టు తీయించి, స్నానం చేయించి దుస్తులు మార్పించారు. అనంతరం నందిగామ మండలం మాగల్లు గ్రామంలోని ఖాశిం అండ్‌ ఖాశిం వృద్ధుల ఆశ్రమంలో చేర్పించారు.

ఫేస్​బుక్ ద్వారా...

ఉప్పమ్మ చిత్రాలను శ్రీదేవి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేశారు. వాటిని గుర్తించిన కుటుంబసభ్యులు తమకు అప్పగించాలని శ్రీదేవిని కోరారు. అనంతరం... ఆశ్రమ నిర్వాహకులు ఆ వృద్ధురాలిని తీసుకుని నందిగామ వైకాపా ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహనరావు కార్యాలయానికి శ్రీదేవి చేరుకున్నారు. ఆయన లేనందున స్థానిక నేతల సహకారంతో ఆమెను పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసుల సహకారంతో ఆ వృద్ధురాలిని వరంగల్‌ తీసుకెళ్లి వరంగల్‌ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ సమక్షంలో కుటుంబీకులకు అప్పగించారు. పుష్కరం తర్వాత తమ చెంతకు చేరిన పెద్ద దిక్కును చూసి.. ఆ కుటుంబం ఉబ్బితబ్బిబ్బైంది. ఉప్పమ్మను గుర్తించి, చేరదీసి తమకు అప్పగించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది.

పుష్కరం తర్వాత.. కుటుంబసభ్యుల చెంతకు!

ఇవీ చూడండి: తెలంగాణలో బీర్లకు కరువొచ్చింది

ABOUT THE AUTHOR

...view details