రాష్ట్రంలోని 10 విశ్వవిద్యాలయాలకు కొత్త ఉపకులపతుల నియామకానికి రెండు మూడు రోజుల్లో ప్రకటన వెలువడనుంది. దీనిపై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఉపకులపతి పదవీకాలం జూన్ 29తో ముగియగా.. మరో ఏడుగురు ఉపకులపతులకు ఈ నెలాఖరులో పదవీకాలం ముగియనుంది. శాతవాహన, బాసరలోని ఆర్‌జీయూకేటీలకు ఉపకులపతులనే నియమించలేదు. మాసబ్‌ట్యాంకులోని జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ఉపకులపతికి జనవరి వరకు గడువుంది. ఈ నెలాఖరుకు ఎక్కువ ఉపకులపతుల పోస్టులు ఖాళీ అవుతున్న నేపథ్యంలో అర్హులైన ఆచార్యుల నుంచి దరఖాస్తుల ఆహ్వానానికి ప్రకటన ఇవ్వనున్నట్లు సమాచారం.
గతంలో ఉపకులపతులను నియమించినప్పుడు ఎస్‌సీ, ఎస్‌టీలకు ఆచార్యులుగా అయిదేళ్ల అనుభవం చాలని రాష్ట్ర ప్రభుత్వం నిబంధన విధించింది. దానిపై కొందరు న్యాయస్థానానికి వెళ్లగా ఇకనుంచి పదేళ్ల యూజీసీ నిబంధనను అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈసారి ఆ నిబంధననే అమలు చేయనున్నారు. అర్హులైన ఆచార్యుల నుంచి దరఖాస్తుల ఆహ్వానానికి 14 రోజులు గడువు ఇవ్వనున్నారు. వాటిని పరిశీలించి అన్వేషణ కమిటీ ముగ్గురిని సిఫార్సు చేస్తుంది. వారిలో ఒకరిని ప్రభుత్వం ఉపకులపతిగా నియమిస్తుంది.