భీమా కోరేగాం-ఎల్గార్ పరిషద్ కేసులో అక్రమంగా మహారాష్ట్రలోని యరవాడ సెంట్రల్ జైలులో ఉన్న వరవరరావుకు వయసు, ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో కనీస సౌకర్యాలు కల్పించాలంటూ సామాజిక వేత్తలు, ఆయన కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. అరవై సంవత్సరాలకు పైగా తెలుగు సాహిత్య విద్యార్థిగా, అధ్యాపకుడిగా, కవిగా, రచయితగా ఉన్న వరవరరావును ఎనిమిది నెలలుగా తెలుగు పత్రికలు, పుస్తకాలు చదవకుండా ఆంక్షలు విధించడంపై వారు మండిపడ్డారు.
వరవరరావుకు కనీస సౌకర్యాలు కల్పించాలని ఇప్పటికే మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావుకు ఆయన సతీమణి హేమలత లేఖ రాశారు. దానికి ఆయన స్పందించకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. మరోమారు ఆయనకు లేఖ రాశారు. ఈ విషయమై ఇవాళ హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో సామాజికవేత్తలు, మేధావులు, రచయితలు, కవులు, పాత్రికేయులతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. యరవాడ జైల్లో కనీస వసతులు లేవని... గతంలో సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసినట్లు వరవరరావు సతీమణి హేమలత వివరించారు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుతో వరవరరావుకు ఉన్న పరిచయం నేపథ్యంలో ఆయన సానుకూలంగా స్పందిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.