రాష్ట్రంలో ఇంజినీరింగ్ ఫీజులు కనీసం 15 నుంచి 20 శాతం పెరగనున్నాయి. ప్రస్తుతం ఫీజు యాభై వేల లోపు ఉంటే... కనీసం 20 శాతం... యాభై వేలు లేదా అంతకు మించి ఉంటే.. 15 శాతం పెరగనుంది. ప్రస్తుతానికి తాత్కాలికంగా 15 నుంచి 20 శాతం పెంచి.. మూడు నెలల తర్వాత పూర్తి స్థాయిలో పెంచుతామని రాష్ట్ర ప్రవేశాలు, నియంత్రణ కమిటీ తెలిపింది. ఫీజులు, కౌన్సెలింగ్ ప్రక్రియపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో.. ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో ఏఎఫ్ఆర్సీ సమావేశమైంది. ఫీజుల ఖరారుకు సుమారు నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నందున... ప్రస్తుతం తాత్కాలికంగా పెంచుతామని ఏఎఫ్ఆర్సీ ఛైర్మన్ జస్టిస్ స్వరూప్ రెడ్డి ప్రతిపాదించారు.
ఎల్లుండి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఉన్నందున.. ఇప్పటికిప్పుడు పూర్తిస్థాయి ఫీజులను ఖరారు చేయడం కష్టం కాబట్టి... మధ్యంతర పెంపును అంగీకరించాలని కోరారు. ఇంజినీరింగ్ కాలేజీలు సమర్పించిన ఆదాయ, వ్యయాలు పూర్తిస్థాయిలో సమీక్షించి మూడు నెలల్లో తుది పెంపును ఖరారు చేస్తామని ఏఎఫ్ఆర్సీ తెలిపింది. దీనికి కాలేజీల సంఘం అంగీకరించింది.