పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులతో సతమతమవుతున్న కాంగ్రెస్కు కొత్త చిక్కొచ్చి పడింది. సీనియర్ నేతలు కూడా మీడియా ముందు నోటికొచ్చినట్లు మాట్లాడటం కార్యకర్తలను ఆందోళనకు గురి చేస్తోంది. పరిషత్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు దక్కించుకోవాలన్న పట్టుదలతో రాష్ట్ర నాయకత్వం, క్షేత్రస్థాయిలో శ్రేణులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇలాంటి సమయంలో నేతల మధ్య విభేదాలు బయటపడటం మరింత కుంగదీసే విధంగా ఉన్నాయి. అంతర్గతంగా చర్చించుకోవాల్సిన విషయాల్ని గాంధీభవన్ వేదికగా మీడియా ముందు విమర్శించుకోవడం పార్టీ వర్గాలను కలవర పెడుతుంది. గాంధీ భవన్లో ఏం జరుగుతుందో తెరాస ముఖ్యులకు కోవర్టులు చేరవేస్తున్నారంటూ... వి. హనుమంతారావు, జగ్గారెడ్డి లాంటి సీనియర్ల వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
సీనియర్ల బహిరంగ విమర్శలు... కష్టాల్లో కాంగ్రెస్ - jaggareddy
తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత పోరు రాజుకుంటోంది. నేతలు కార్యకర్తల్లో గందరగోళం సృష్టించేలా వ్యవహరిస్తున్నారు. పార్టీలో ఉన్న కోవర్టులు గాంధీ భవన్లో ఏం జరిగేది తెరాస నేతలకు చేరవేస్తున్నారని సీనియర్లు బాహటంగానే విమర్శిస్తున్నారు.
మొదటి నుంచి పార్టీని నమ్ముకొని ఉన్న వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. రాష్ట్ర పార్టీలో పూర్తిగా ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని బహిరంగంగానే అంటున్నారు. అంబేడ్కర్ విగ్రహాం కూల్చివేతపై పోరాటం చేసేందుకు నాయకత్వం సరైన సహకారం అందించలేదని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పార్టీ మారనని చెప్పిన జగ్గారెడ్డి.. ఈ నెల 25 నుంచి 30 లోపు గాంధీ భవన్లో ఉంటానో, తెరాస భవన్లో ఉంటానో కాలమే నిర్ణయిస్తుందనటం కాంగ్రెస్ నాయకత్వాన్ని మరింత కలవరానికి గురిచేస్తోంది.
ఇవీ చూడండి: రాజకీయం వయా ఆధ్యాత్మికం