సార్వత్రిక ఎన్నికల సమయంలో వ్యవసాయ, రైతాంగ సమస్యలు పరిష్కరిస్తామని ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే... నాసిక్, ముంబయి తరహాలో మరో లాంగ్ మార్చ్ నిర్వహిస్తామని అఖిల భారత కిసాన్ సభ సంయుక్త కార్యదర్శి విజ్జు కృష్ణణ్ వెల్లడించారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'అరిబండి ఫౌండేషన్' ఆధ్వర్యంలో 'వ్యవసాయ రంగంలో నేటి రేపటి కర్తవ్యాల'పై జరిగిన సదస్సుకు విజ్జు కృష్ణణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఇక్రిశాట్ విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ అరిబండి ప్రసాదరావు తన తండ్రి, దివంగత శాసనసభ్యుడు అరిబండి లక్ష్మీనారాయణ పేరిట అరిబండి ఫౌండేషన్ లాంఛనంగా ప్రారంభించారు.
అరిబండి ఆధ్వర్యంలో వ్యవసాయ రంగ సదస్సు వ్యవసాయ రంగ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు నుంచి గట్టెక్కించాలంటే... పెట్టుబడి ఖర్చులు తగ్గింపుతో పాటు పంట సాగు పెట్టుబడిపై అదనంగా 50 శాతం ఇవ్వాలని విజ్జు కృష్ణణ్ అన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం గిట్టుబాటు ధరలు నిర్ణయించి అమలు చేయాలని పేర్కొన్నారు.
వ్యవసాయ రంగం, రైతాంగం ఎదుర్కొంటున్న ధీర్ఘకాలిక సమస్యల పరిష్కారం, వైద్య సేవలు, బాలల అభ్యున్నతి లక్ష్యాలుగా అరిబండి ఫౌండేషన్ పనిచేయబోతోందని ఆ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ అరిబండి ప్రసాదరావు స్పష్టం చేశారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి, అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి, సుస్థిర వ్యవసాయ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ జీవీ రామాంజనేయులు, అరిబండి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: అభివృద్ధి చేశాం.. ఇంకా చేసి చూపిస్తాం..