వ్యవసాయ అనుబంధ రంగాలకు సర్కారు పెద్దపీట రాష్ట్రంలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు కేసీఆర్ సర్కారు పెద్దపీట వేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓ హోటల్లో రే కన్సల్టింగ్, కంప్లీట్ అగ్రి బిజినెస్ సొల్యూషన్స్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ వ్యవసాయ, వ్యాపార సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐటీసీ ఐటీ, వ్యవసాయ విభాగం అధిపతి శివకుమార్, మహారాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఉపకులపతి డాక్టర్ వెంకటేశ్వర్లు, ఇఫ్కో ఓఎస్‌డీ డాక్టర్ జి.రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ధనూక గ్రూపు ఛైర్మన్ రాంగోపాల్ అగర్వాల్‌కు జీవిత సాఫల్య పురస్కారం లభించింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావు, అగ్రి నోవా సంస్థ అధిపతి, ఏపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సహా... 33 మంది పారిశ్రామికవేత్తలకు పురస్కారాలు ప్రదానం చేశారు.
వ్యవసాయ రంగం, రైతాంగ ఆదాయం రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో వ్యవసాయ ఉపకరణాల తయారీ కంపెనీలు, అంకుర కేంద్రాలు నాణ్యమైన ఉత్పత్తులు అందించాలన్న లక్ష్యం అభినందనీయమని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకాన్ని ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా కిసాన్ సమ్మాన్ పేరిట విస్తరించారని స్పష్టం చేశారు.
ఇప్పటికే 24 గంట ఉచిత విద్యుత్తు, రైతుబంధు, బీమా పథకాలు, భారీ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా రాబోయే రోజుల్లో వ్యవసాయ అనుబంధ రంగాల్లో స్వయం సమృద్ధి సాధన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇవీ చూడండి:బీసీ గురుకులాల్లో కొలువుల పండగ