YS Sharmila on party:: ప్రతిపక్షాలు భాధ్యత మరిచిపోవడంతోనే పార్టీ పెట్టానని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్సార్ సుపరిపాలన కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ అంటూ వెల్లడించారు. ఆమె చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 66వ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో కొనసాగుతోంది. ఇవాళ ఉదయం మండలంలోని ఇరవెండి గ్రామం నుంచి మొదలైన పాదయాత్ర సారపాక గ్రామం వరకు చేరుకుంది. ఇరవెండి గ్రామంలో రైతు గోస దీక్షలో రైతులతో వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఇటీవల కాలంలో సారపాకలోని మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో దుఃఖసాగరంలో ఉన్న మాజీ ఎమ్మెల్యేను షర్మిల పరామర్శించారు. ఇవాళ సాయంత్రం భద్రాచలంలోని అంబేడ్కర్ సెంటర్లో భారీ బహిరంగ సభలో షర్మిల మాట్లాడనున్నారు.
కేసీఆర్ తప్పు చేస్తే.. రైతులకు శిక్ష: ఇరవెండి గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు గోస కార్యక్రమంలో షర్మిల ప్రసంగించారు. భూముల సమస్య పరిష్కరించాలని కేసీఆర్కు చిత్తశుద్ధి లేదని.. పట్టాలు ఇవ్వకపోగా ఉన్న వాటికి లాక్కున్నారని ఆమె ఆరోపించారు. రైతులు కోటీశ్వరులయితే ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. రుణమాఫీ అని చెప్పి ఎంత మందికి రుణాలు మాఫీ చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ రుణాలు మాఫీ చేస్తే కదా.. కొత్తగా బ్యాంకులు రుణాలు ఇచ్చేదంటూ ఎద్దేవా చేశారు. వరి రైతులను కేసీఆర్ నిండా మోసం చేశారని ఆమె విమర్శించారు. తప్పుడు సంతకం పెట్టి యాసంగిలో రైతులను నిండా ముంచారన్న షర్మిల.. తప్పు కేసీఆర్ చేస్తే ఈ రోజు శిక్ష రైతులకు పడిందన్నారు.
పరిహారం ఇవ్వాలి: 17 లక్షల ఎకరాల్లో వరి వేయని రైతుకు ఎకరాకు రూ.25 వేలు పరిహారం ఇవ్వాలని వైఎస్ షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 35 లక్షల ఎకరాల్లో పండిన వరి ధాన్యాన్ని సైతం కొనడం లేదని ఆమె ఆరోపించారు. 8 వేల కొనుగోలు కేంద్రాలు అని చెప్పి వెయ్యి కూడా తెరవలేదన్న ఆమె.. కేసీఆర్ రైతులను ఏ రకంగా ఆదుకున్నారో ఒక్కటి చూపించాలన్నారు.