భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆల్లపల్లి మండలం మర్కోడు గ్రామానికి చెందిన తాళ్లపల్లి సంతోష్- భాగ్యలక్ష్మి దంపతులు మూడో కాన్పు కోసం ఈ నెల 17న కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వెళ్లారు. కడుపులో బిడ్డ పరిస్థితి విషమంగా ఉందన్న వైద్యులు... తల్లిని మాత్రమే కాపాడగలమని చెప్పారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆపరేషన్ చేసిన తర్వాత పుట్టిన బిడ్డ చనిపోయాడని... ఆ తర్వాత బాలింత అపస్మారక స్థితిలోకి వెళ్లిందని ఆరోపించారు.
సమయం గడుస్తున్నా.. బాలింత స్పృహలోకి రాకపోవడంతో వైద్యులు పరీక్షించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఖమ్మం లేెెదా వరంగల్‌కు తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు సూచించారు. తొలుత బిడ్డకు మాత్రమే ప్రమాదమన్న వైద్యులు... తర్వాత తల్లి పరిస్థితి బాగాలేదని చెప్పడంతో కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వెంటనే భాగ్యలక్ష్మిని ఖమ్మం తరలించేందుకు 108కు సమాచారం ఇచ్చారు. 108 వాహన సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చివరకు జిల్లా అధికారులను సంప్రదించగా... సాయంత్రం 3 గంటలకు 108 వాహనం ఏర్పాటు చేశారు. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.