ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ పల్లెలన్నీ మంచం పడుతున్నాయి. ఇంటికి ఒకరిద్దరు జ్వర పీడితులవుతున్నారు. వైరల్ ఫీవర్, డెంగీ, మలేరియా వంటి రోగాలతో జనం బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఏడు ఏరియా ఆస్పత్రులు, 57 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఎనిమిది అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నా... అన్ని ఆస్పత్రుల్లోనూ జ్వర పీడితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అయితే పడకలు సరిపోక ఒకే మంచంపై ఇద్దరు, ముగ్గురు రోగులను పడుకోబెట్టి చికిత్స చేయాల్సి వస్తోంది.
ఆస్పత్రులు ఫుల్... జేబుల్ నిల్...
గతేడాది రాష్ట్రంలోనే అత్యధికంగా డెంగీ కేసులు నమోదైన బోనకల్లు, చింతకాని మండలాల్లో... ఈ సారి కూడా విషజ్వరాలు అంతకంతకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. విషజ్వరాలతో ప్రభుత్వాస్పత్రులకు వెళ్తే... అక్కడ సరైన వైద్య సేవలు అందక ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే వారి జేబులకు చిల్లుపడుతోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో డెంగీ నిర్ధరణ పరీక్షకు 800 నుంచి 1600 రూపాయల వరకు ఖర్చవుతోంది. అంతేకాదు ప్లేట్లెట్స్ తగ్గాయంటూ వారం రోజుల వరకు ఆస్పత్రుల్లోనే ఉంచుకోవడం వల్ల వేలకు వేలు ఆస్పత్రుల్లో చెల్లించాల్సి వస్తోందని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.