రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్యరాజన్ ఆదిమ గిరిజన తెగలలో పౌష్టికాహారం లోపం నివారణపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం దమ్మపేట మండలం పూసుకుంట కొండరెడ్డి గ్రామంలో పర్యటించింది. కొండరెడ్లలో పోషకాహార లోపాన్ని నివారించేందుకు గవర్నర్ తమిళిసై.. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఈఎస్‌ఐ వైద్య కళాశాల సహకారంతో ప్రత్యేక కార్యక్రమం చెప్పటినట్లు గవర్నర్ జాయింట్ సెక్రటరీ భవాని శంకర్ తెలిపారు.
ఈ కార్యక్రమం అమలుకోసం రాష్ట్రంలోని మూడు జిల్లాలోని ఆరు గిరిజన ఆదిమ తెగల గ్రామాల్ని ఎంపిక చేసుకున్నట్లు ఆయన చెప్పారు. గర్భిణీలకి, పిల్లలకు పోషకాహారం సరిగ్గా అందకపోవడం కారణంగానే వారిలో ఆరోగ్య సమస్యలు వస్తున్నట్లు సర్వే ద్వారా తెలిసిందన్నారు. కొండరెడ్లలో పౌష్టికాహార లోపాల మీద ఒక అంచనాకు వచ్చి వాటిని అధిగమించేందుకు కార్యాచరణను గవర్నర్ మార్గదర్శకత్వంలో చేపట్టడం జరుగుతుందని ఆయన వివరించారు.