నూటొక్క శతకాల ధీరుడు... ఈ ఆచార్యుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణానికి చెందిన చిగురుమళ్ల నాగవెంకట శ్రీనివాసరావుకు తెలుగు భాషంటే ప్రాణ సమానం. దుమ్ముగూడెం మండలంలో సర్కారు బడిలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అమృత సమానమైన తెలుగు భాష ఔన్నత్యాన్ని ఖండాంతరాలకు విస్తరించేలా ఏదైనా చేయాలనుకున్నాడు. నూటొక్క సామాజిక అంశాలను ప్రామాణికంగా తీసుకుని నూటొక్క శతకాలు రచించాడు.
సామాజిక అంశాలే ఆయన పద్యాలకు ఆధారాలు
అమ్మ శతకం, గురువు శతకం, మొక్క శతకం, చెత్త శతకం, జవాన్ శతకం, జర్నలిస్టు శతకం ఇలా ఒక్కటేమిటి నూటొక్క సామాజిక అంశాలపై ఒక్కో శతకం రచించారు. వీటిని దేశ విదేశాల్లో ప్రముఖులచే ఆవిష్కరించి తెలుగు భాష ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిచెప్పారు.
ఎన్నో సత్కారాలు
తెలుగుభాష అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషికి ఎన్నో సన్మానాలు, సత్కారాలు, అవార్డులు, పురస్కారాలు పొందారు. తాను రచించిన నూటొక్క శతకాలను ముద్రించి దిల్లీలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం దేశంలోని దేశంలోని అన్ని జిల్లా కలెక్టర్ల చేతుల మీదుగా ఈ పుస్తకాలు ఆవిష్కరించడం విశేషం. భారతదేశంలోనే కాకుండా తానా 22వ మహాసభల్లో 15వేల మంది తెలుగు వారి సమక్షంలో ఈ శతకాలు ఆవిష్కరించారు.
తెలుగు భాష మాధుర్యాన్ని భావితరాలకు అందించాలనే లక్ష్యంతోనే ఈ మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టానని అంటారు శ్రీనివాసరావు. ఈ మహాయజ్ఞంలో భాగస్వామికావడం తనకెంతో సంతోషంగా ఉందంటున్నారు ఆయన సతీమణి.
భాషాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తా
త్వరలో లక్షమంది విద్యార్థులతో 100 పద్యాలను ఒకేరోజు దేశంలోని అన్ని ప్రాంతాల్లో గానం చేయించే కార్యక్రమం నిర్వహిస్తానంటున్నారు. తన పద్యాలతో యువతలో తెలుగు వెలుగు కాంతులను ప్రకాశింపజేస్తున్న శ్రీనివాసరావు కృషికి యావత్ తెలుగుజాతి భాషాభివందనాలు తెలుపుతోంది.
ఇదీ చూడండి: బావిలో పడిన కారు.. త్రుటిలో తప్పిన ప్రమాదం