ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా మహోగ్రరూపం దాల్చిన గోదారమ్మ.. క్రమంగా శాంతిస్తోంది. నిన్న సాయంత్రం భద్రాచలం వద్ద 70.10 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం.. ఈరోజు సాయంత్రానికి 69.4 అడుగుల వద్ద కొనసాగుతోంది. వరద ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోందని అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో 24.29 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా.. ఈరోజు సాయంత్రానికి 23.40 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.
నదీ తీర ప్రాంత గ్రామాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వందల గ్రామాల్లో విద్యుత్తు స్తంభాలు దెబ్బతిన్నాయి. దుమ్ముగూడెం, చర్ల మండలాలకు ఈ సమస్య తీవ్రస్థాయిలో తలెత్తడంతో సమాచార వ్యవస్థలన్నీ స్తంభించిపోయాయి. సుమారు 200 గ్రామాలకు మండల కేంద్రాలతో సంబంధాలు తెగిపోయాయి. ప్రజా, రవాణా, సమాచార వ్యవస్థలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ముంపు ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది.