తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై సీతమ్మ సాగర్ పేరుతో మరో సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి వద్ద ప్రస్తుతం ఉన్న దుమ్మగూడెం ఆనకట్ట (సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్ట)కు 200 మీటర్ల దూరంలో దీన్ని నిర్మించనున్నారు. డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్టు) పూర్తి కావటం వల్ల ఇంజినీరింగ్ అధికారులు ప్రస్తుతం భూసేకరణ సర్వే చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ప్రారంభమైన ఈ పనులను పక్షం రోజుల్లో పూర్తి చేసి, భూసేకరణ ప్రారంభించేలా అధికారులు సమాయత్తమవుతున్నారు. అక్టోబరులో నిర్మాణ పనులు ప్రారంభించాలని కృతనిశ్చయంతో ఉన్నారు.
రెండు విడతలుగా..
సీతమ్మ సాగర్ నిర్మాణానికి అవసరమైన భూములను రెండు విడతలుగా సేకరించనున్నారు. మొదటి విడతలో కుడి వైపున అశ్వాపురం మండలంలో 138.29, మణుగూరు మండలంలో 119.13, ఎడమ వైపున దుమ్ముగూడెం మండలంలో 213.27 ఎకరాలు వెరసి 470.69 ఎకరాలు సేకరించనున్నారు. రెండో విడత కుడి వైపున అశ్వాపురం మండలంలో 154.22 ఎకరాలు, మణుగూరు మండలంలో 236.18 ఎకరాలు, ఎడమ వైపున దుమ్ముగూడెం మండలంలో 205.36, చర్ల మండలంలో 739.17 ఎకరాలు వెరసి 1334.93 ఎకరాలు సేకరించనున్నారు. ఆనకట్ట, కరకట్టల నిర్మాణాల కోసం మొత్తం 1,808.17 ఎకరాల భూమి అవసరం కానున్నది. భూ సేకరణ, పెగ్ మార్కింగు తదితర కార్యక్రమాలను అధికారులు చేపడుతున్నారు. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టుకు 70 టీఎంసీల గోదావరి జలాలను ఇక్కడి నుంచే సమీకరించనున్నారు. ఆనకట్ట నిర్మాణంతో గోదావరి మిషన్ భగీరథ వంటి ప్రసిద్ధ తాగునీటి పథకాలు, భారజల ప్లాంటు, రాష్ట్ర ప్రభుత్వ సింగరేణి, భద్రాది థర్మల్ విద్యుత్తు ప్రాజెక్టు వంటి పరిశ్రమలకు సరిపడా జలాలు లభ్యం కానున్నాయి.