Vanama Venkateswara Rao election controversy : శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి ఖమ్మం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ హస్తం గూటికి చేరడం.. ఇంటింటికి బీజేపీ పేరుతో కమళ దళం వ్యూహం మార్చడంతో ఖమ్మంలో బీఆర్ఎస్కు కొత్త సవాల్లు ఎదురవుతున్నాయనే చెప్పొచ్చు. తాజాగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నికపై హైకోర్టు మంగళవారం ఇచ్చిన తీర్పుతో మరోసారి బీఆర్ఎస్కు గట్టి షాక్ తగిలిందనే చెప్పొచ్చు. ఎమ్మెల్యే ఎన్నిక వివాదంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఇరువురు ఒకే పార్టీకి చెందడంతో సొంతపార్టీ నేతల్లోనే అభిప్రాయ భేదాలు వస్తున్నాయి. ఖమ్మం గులాబీ నేతల్లో ఆధిపత్య పోరు నడుస్తోందని టాక్ బాగా వినిపిస్తోంది.
ఇది ఇలా ఉండగా.. వనమా వెంకటేశ్వరరావు ఎన్నికపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మరోసారి ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తీర్పును తాత్కాలికంగా నిలిపివేయాలని కోరుతూ వనమా హైకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో అప్పీలు చేసేందుకు వీలుగా 30 రోజులు లేదా తీర్పు సర్టిఫయిడ్ కాపీ తీసుకొనే వరకు సస్పెండ్ చేయాలని బుధవారం లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. వనమా అభ్యర్థన మేరకు పిటిషన్‌పై హైకోర్టు అత్యవసర విచారణ జరిపింది. వనమా అభ్యర్థనపై జలగం వెంకట్రావు న్యాయవాది రమేష్ వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
మరోవైపు కొత్తగూడెం ఎమ్మెల్యేగా తనను ప్రకటిస్తూ గెజిట్ విడుదల చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని జలగం వెంకట్రావు కోరారు. బీఆర్కే భవన్‌లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని జలగం వెంకట్రావు కలిశారు. వనమా వెంకటేశ్వరరావు ఎన్నికను రద్దు చేస్తూ.. హైకోర్టు తనను ఎమ్మెల్యేగా ప్రకటించిందని సీఈవోకు వివరించి తీర్పు ప్రతిని సమర్పించారు. గెజిట్ జారీ ప్రక్రియ నిర్వహించాలని సీఈవోను కోరారు.