భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. ఈరోజు ఉదయం నుంచి కుండపోత వర్షం కురవడం వల్ల పలు రహదారులు, ఏజెన్సీలోని పల్లె ప్రాంతాలు, కాలనీలు జలమయమయ్యాయి. భద్రాచలంలోని లోతట్టు కాలనీలో ఉన్న ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. బూర్గంపాడు మండలంలోని సారపాక, ఇరవండి గ్రామాల మధ్య రహదారిపైకి వరద నీరు రావడం వల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతోపాటు భద్రాచలంలోని విలీన మండలాలైన వీఆర్ పురం, కూనవరం, చింతూరు మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఆయా మండలాల్లోని గ్రామాలకు వెళ్లే దారిలో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వీఆర్ పురం మండలంలోని అన్నవరం గ్రామం వద్ద వర్షపు నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. దీంతో చింతూరు-వీఆర్ పురం మండలాలకు రాకపోకలు నిలిచాయి.
ఉప్పొంగుతున్న వాగులు, వంకలు... రాకపోకలకు అంతరాయం - ఉప్పొంగుతున్న వాగులు, వంకలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల పలు రహదారులు, ఏజెన్సీలోని పల్లె ప్రాంతాలు, కాలనీలు జలమయ్యాయి. వాగులు, వంకలు పొంగి రోడ్లపైకి వరద నీరు రావడం వల్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పలు మండలాల్లోని గ్రామాల్లో ఇళ్లలోకి నీరు చేరడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అశ్వాపురం మండలంలో పోటెత్తిన వరద
భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో వరద నీరు పోటెత్తింది. ఆనందపురం, మల్లెలమడుగు గ్రామాల్లో ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతు వాగు, ఇసుక వాగు పొంగి ప్రవహించడం వల్ల 16 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. కడియాల బుడ్డి వాగు ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల మొండికుంట- భద్రాచలం ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భీముని గుండం కొత్తూరు వద్ద సీతారామ సాగునీటి ప్రాజెక్ట్ మొదటి పంప్ హౌస్లోకి వరద నీరు పోటెత్తడం వల్ల నిర్మాణ పనులు స్తంభించాయి.
ఇవీ చూడండి: శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద