తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రమాదపుటంచున ప్రయాణం... పట్టుతప్పితే నిలిచేనా ప్రాణం.. - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాజా వార్తలు

పది నెలల చిన్నారి పాలకోసం గుక్కపట్టి ఏడుస్తోంది... ఎరువు కోసం వెళ్లిన భర్త కోసం ఓ ఇళ్లాలు తలుపు రెక్కను పట్టుకును చూస్తోంది. నిన్ననగా వెళ్లిన బిడ్డకోసం ఓ తల్లి చూరు కింద కూర్చుని బాట వేపు చూస్తుంది. అయిన వాళ్లంతా అవతలి ఒడ్డునే ఉన్నా... పొంగుతున్న వాగు వారికి అడ్డుగా నిలిచింది. రోజులు తరబడి ఎదురు చూస్తున్నా పెరుగుతున్న ప్రవాహమే తప్ప తగ్గడం లేదు. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంత ప్రజల పరిస్థితి.

ప్రమాదపుటంచున ప్రయాణం... పట్టుతప్పితే నిలిచేనా ప్రాణం..
ప్రమాదపుటంచున ప్రయాణం... పట్టుతప్పితే నిలిచేనా ప్రాణం..

By

Published : Aug 15, 2020, 9:47 PM IST

ఎడతెరిపిలేని వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మన్యం ప్రాతం తడిసి ముద్దయింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గుంపునకు గుంపునకు మధ్య అందంగా కనిపించే వాగులు ఉగ్రరూపం దాల్చి రాకపోకలు నిలిపేశాయి. నాలుగురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గుండాల మండలం పూర్తిగా వరద గుప్పిట్లో చిక్కుకుపోయింది. రెండురోజుల కిందట మండల కేంద్రానికి వెళ్లిన ప్రజలు... ఇళ్లకు చేరుకునేందుకు పడుతున్న తిప్పలు ప్రాణంతో చెలగాటంలా ఉన్నాయి. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మల్లన్నవాగు దాటేందుకు ప్రజలు చేసిన సాహసోపేత ప్రయత్నం...ఏజెన్సీ ప్రజల రవాణా కష్టాలకు సాక్ష్యంగా నిలుస్తోంది.

వరి నాట్ల సీజన్ కావడం వల్ల సమీప గ్రామాల నుంచి ప్రజలు మండల కేంద్రానికి... యూరియా, ఇతర ఎరువుల కోసం వెళ్లారు. కానీ తిరుగొచ్చేసరికి పొందుతున్న వాగు వారిని అవతలిఒడ్డునే నిలిపేసింది. ఒకటిన్నర రోజులు ఎదురుచూసి చేసేదేమీ లేక వాగు ఒడ్డుకి తాడు కట్టుకుని ప్రమాదపుటంచున ప్రయాణం చేస్తున్నారు.

తల్లడిల్లిన పసికందు

నాగారం గ్రామానికి చెందిన జోగా శోభారాణి శుక్రవారం ఉదయం యూరియా కోసం మండల కేంద్రంలోని సొసైటీకి వెళ్లింది. తిరుగొచ్చేసరికి మలన్న వాగు ఉద్ధృతి భారీగా పెరగింది. వాగు దాటలేని పరిస్థితిలో ఒకటిన్నర రోజుల నుంచి అవతలి ఒడ్డునే ఉండిపోయింది. తల్లి కోసం పది నెలల చిన్నారి గుక్క పట్టి ఏడుస్తుండటంతో చలించిన గ్రామస్థులు ఆమెను తాళ్ల సాయంతో వాగు దాటించారు. కొడవటంచ, నాగారం, సాయనపల్లి గ్రామాలకు వెళ్లాల్సిన స్థానికులు కూడా తాళ్ల సాయంతో వాగు దాటారు.

ఇదీ చూడండి:వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్‌ ఆరా

ABOUT THE AUTHOR

...view details