భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటించారు. వనవాసి కల్యాణ పరిషత్ ఆధ్వర్యంలో 123 మంది గిరిజన గర్భిణీలకు సీమంతం చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి పసుపు, కుంకుమ, గాజులు, పూలు, పండ్లు ఇచ్చి సీమంతం చేశారు. గర్భిణీలు పోషకాహారం తీసుకుని పండంటి బిడ్డకు జన్మనివ్వాలని గవర్నర్ సూచించారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన తలసేమియా బాధితుల కోసం నిర్మించతలపెట్టిన 30 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గవర్నర్ నిధుల నుంచి 20 లక్షలను తలసేమియా బాధితుల కోసం అందించారు. అనంతరం వృద్ధులకు కళ్ల అద్దాలను పంపిణీ చేశారు.
123 మంది గిరిజన గర్భిణులకు గవర్నర్ సీమంతం - భద్రాద్రిలో గవర్నర్ పర్యటన
శ్రీరామ పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొన్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్... అనంతరం భద్రాచలంలో జరిగిన వివిధ కార్యక్రమాలకు హాజరయ్యారు. 123 మంది గిరిజన గర్భిణులకు సీమంతం చేశారు. అనంతరం 30 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
అంతకుముందు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవంలో గవర్నర్ పాల్గొన్నారు. రామాలయానికి చేరుకున్న గవర్నర్‌కు ఆలయ ఈవో శివాజీ సాదర స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంతోపాటు అనుబంధంగా ఉన్న ఆంజనేయస్వామిని, లక్ష్మీతాయారు అమ్మవారిని దర్శించుకుని గవర్నర్ పూజలు చేశారు. ఆలయం నుంచి పట్టువస్త్రాలు శిరస్సుపై పెట్టుకుని పట్టాభిషేకం నిర్వహిస్తున్న మిథిలా ప్రాంగణానికి చేరుకున్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి మహాపట్టాభిషేక క్రతువును వీక్షించి ఆసాంతం ఆస్వాదించారు. రాముల వారి సేవలో తరించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. రామచంద్రుని ఆశీర్వాదం తనపై, ప్రజలపై ఉంటుందన్నారు.
ఇదీ చదవండి :రామయ్యకు మహాపట్టాభిషేకం.. పులకించిన భద్రాద్రి