భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శనివారం రాత్రి వరకు ఉద్ధృతంగా ప్రవహించిన గోదావరి... క్రమంగా శాంతిస్తోంది. రాత్రితో పోలిస్తే 3 అడుగుల మేర గోదావరి నీటిమట్టం తగ్గింది. శనివారం రాత్రి 11 గం.కు 48.50 అడుగులుగా ఉన్న నీటమట్టం... ఉదయం 9 గంటలకు 45.3 అడుగులకు చేరింది. ఫలితంగా రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
ముంపులోనే దుకాణాలు
గోదావరికి 11.30 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. వరద నీటితో భద్రాచలంలోని రామయ్య సన్నిధి పడమర మెట్ల వద్ద నీరు చేరింది. అన్నదాన సత్రంతో పాటు చాలా దుకాణాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. గోదావరి స్నానఘట్టాల ప్రాంతంతోపాటు విద్యుత్ స్తంభాలు పుష్కరఘాట్లు వరద నీటిలో మునిగి పోయాయి. భద్రాచలం నుంచి దిగువ ప్రాంతానికి వెళ్లే ప్రధాన రహదారిపై వరద నీరు చేరింది. ఈ క్రమంలో ముంపు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
హెచ్చరికలు జారీ
శనివారం ఉదయం 11 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 45.20 అడుగులకు చేరగా... అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు 47.30 అడుగులుగా నమోదైంది. సాయంత్రం 7 గంటల సమయంలో నీటిమట్టం 48.30 అడుగులు దాటింది. గోదావరి నీటిమట్టం 48 అడుగులు దాటడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం నీటిమట్టం నిలకడగా ఉండడంతో దానిని ఉపసంహరించుకున్నారు.