పుట్టిన బిడ్డను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి నగదు కోసం విక్రయించిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో జరిగింది. కానీ జన్మనిచ్చిన తల్లికి మాత్రం పురిట్లోనే శిశువు మరణించాడని చెప్పాడు. నవమాసాలు మోసి కన్న బిడ్డను కోల్పోయిన ఆ తల్లి వేదనకు గురి చేశాడు. ఇదంతా గమనించిన అంగన్వాడీ టీచర్ కూపీ లాగడంతో ఆలస్యంగానైనా వెలుగులోకి వచ్చింది.
రెండు లక్షలకు విక్రయం:ఆంధ్ర ప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం అల్లిపల్లికి చెందిన గంట చిలకమ్మా మూడో కాన్పు కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఈనెల మూడో తేదీ చేరింది. అదే రోజు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే బిడ్డను ప్రసవించే సమయంలో ఆమె స్పృహ కోల్పోయింది. ఇదే అదునుగా భావించిన చిలకమ్మా భర్త ఘంటా అరుణ్ కుమార్, అత్త మేరీ, చింతలపూడి మండలానికి చెందిన ఆర్ఎంపీ వైద్యులైన బుచ్చిబాబు, శ్రీనివాసరావుతో పాటు అశ్వరావుపేటకు చెందిన ప్రశాంతి శిశువును తల్లి నుంచి వేరు చేసి విశాఖపట్నానికి చెందిన వారికి రూ.2 లక్షలకు విక్రయించారు.
గుడ్ల కోసం అంగన్వాడీ టీచర్‌తో గొడవ:స్పృహలోకి వచ్చిన చిలకమ్మకు మాత్రం శిశువు పురిటిలోనే మరణించినట్లు చెప్పి స్వగ్రామం తీసుకువెళ్లారు. పుట్టిన బిడ్డ మృతి చెందాడని భావించిన ఆమె దీనంగా ఇంటి వద్దనే ఉంటుంది. అప్పటికే ఆమెకు ఐదేళ్ల బాబు, రెండేళ్ల కుమార్తె ఉన్నారు. అయితే ఆమె అత్త మేరీ పిల్లలిద్దరిని స్థానిక అంగన్వాడీ కేంద్రానికి తీసుకెళ్లేది. ఈ క్రమంలోనే ఆ కేంద్రంలో పిల్లలకు ఇచ్చే గుడ్లు, ఇతర పౌష్టికాహారం తన మన చిన్న మనవడికి కూడా ఇవ్వాలని అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మి, ఆయా నాగమణితో గొడవకు దిగింది. దీంతో వారు పుట్టిన బిడ్డ పురిటిలోనే మరణించాడని చెప్పారు కదా.. గుడ్లు పౌష్టిక ఆహారం ఎలా ఇస్తారని నిలదీశారు. అంతేకాదు మేరీ తీరుపై అనుమానం రావడంతో కూపీ లాగారు. దీంతో శిశువును విక్రయించిన బాగోతం బట్టబయలైంది. దీనిపై అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మి ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఎస్సై అరుణ విచారణ చేపట్టారు. త్వరలోనే శిశువును కన్నతల్లికి అప్పగిస్తామని ఎస్సై తెలిపారు.
ఇదీ చూడండి:
OU LADIES HOSTEL: చికెన్ కర్రీలో పురుగు.. ఓయూలో విద్యార్థినుల ఆందోళన