Farmer Problems At Rice Mills : ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ధాన్యం సేకరణ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. రెండు జిల్లాల్లో కలిపి సుమారు 5.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా ఉంది. ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని ఖమ్మం జిల్లాలోని 64 మిల్లులకు, భద్రాద్రి జిల్లాలోని 33 మిల్లులకు కేటాయించారు. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో 30 వేలు, భద్రాద్రి జిల్లాలో 9 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు.
గత రెండు సీజన్లలో సేకరించిన ధాన్యం నిల్వలతోనే మిల్లులన్నీ నిండిపోయి ఉన్నాయని.. ఈ సారి ధాన్యం తీసుకునే పరిస్థితి లేదని మిల్లర్లు సీజన్ ఆరంభంలోనే అధికారులకు తేల్చి చెప్పారు. ఖమ్మం జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నులు, భద్రాద్రి జిల్లాలో 50 వేల మెట్రిక్ టన్నులు ధాన్యం తీసుకునేందుకు మిల్లర్లు అంగీకరించారు. మిగిలిన ధాన్యం తరలించేందుకు అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకున్నారు. ఇలా మిల్లర్లుకు ఎక్కడా ఇబ్బందులు లేకుండానే అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది.
తమ ఇష్టారాజ్యంగా..:అయినాఉమ్మడి జిల్లాలో కొన్ని మిల్లులు.. నిబంధనలు గాలి కొదిలేసి.. ఇష్టారాజ్యంగా మాయాజాలానికి తెరలేపిన తీరు.. మిల్లర్ల దమననీతికి అద్దం పడుతోంది. చాలా మంది మిల్లర్లు అడ్డదారుల్లో సొంతంగా ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా.. ఎలాంటి రికార్డులు నమోదు చేయడం లేదని అధికారుల తనిఖీల్లో తేటతెల్లమైంది.