పోడు రైతుల సమస్యలు పరిష్కరించాలని గళంవిప్పిన అఖిల పక్షం.. రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల దిగ్బంధం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అఖిలపక్షం నేతలు నిరసన బాట పట్టారు (ALL PARTY LEADERS PROTEST). పోడు భూముల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళన చేశారు. రైతులపై అటవీశాఖ దాడులను ఆపకపోతే పోరాటం ఉద్ధృతం చేస్తామన్నారు. రహదారులు నిర్బంధించారు. పలుచోట్ల ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్లకార్డ్సులు ప్రదర్శిస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అశ్వారావుపేట వద్ద ధర్నాలో పాల్గొన్న చాడ, తమ్మినేని..
పోడు భూముల సమస్యను పరిష్కరించాలని.. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేటలోని సరిహద్దు వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. నిరసనలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, సీపీఐ (ఎంఎల్ ) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, కాంగ్రెస్, తెలుగుదేశం జిల్లా నాయుకులు పాల్గొన్నారు. పోడు భూముల వ్యవహారంలో ముఖ్యమంత్రి ద్వంద్వ వైఖరి వీడాలని కోరారు. పోడు సాగు దారులకు పట్టాలు ఇవ్వకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. సాగు దారులపై పెట్టిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో సుమారు రెండు వేలకు పైగా గిరిజనులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట వద్ద నిరసనలో పాల్గొన్న అఖిలపక్షం నేతలు ఖమ్మం జిల్లాలో నేతల అరెస్ట్
ఖమ్మం జిల్లాలో రహదారులు సంపూర్ణంగా దిగ్భందించారు. భద్రాచలంలో గోదావరి వంతెనపై రాస్తారోకో చేయటంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అశ్వరావుపేట సరిహద్దు వద్ద నిర్వహించిన ధర్నాలో చాడ వెంకట్ రెడ్డి, తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే పోరు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
మిర్యాలగూడలో జూలకంటి గృహనిర్బంధం
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి గృహ నిర్బంధం చేశారు. రంగారెడ్డిని అడ్డుకున్న పోలీసులు... బయటకు వెళ్లకుండా నిర్బంధించడంతో ఇంట్లోనే దీక్షకు దిగారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. సాగు చేసుకుంటున్న రైతులపై అటవీశాఖ వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. ఆసిఫాబాద్‌లోనూ నిరసన తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం వద్ద జాతీయ రహదారిపై అఖిలపక్షం ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. పోడు భూముల పై పేదలకు హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు.
బాసరలో రాస్తారోకో..
ఆదివాసులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు... పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గోవిందరావుపేట మండలం బాసర గ్రామంలో జాతీయ రహదారిపై అఖిలపక్ష ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూముల్లో అటవీశాఖ అధికారులు హరితహారం పేరుతో మొక్కలు నాటుతున్నారని.. అటవీ చట్టాలను పక్కనపెట్టి గిరిజనులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. గిరిజనులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
బాసరలో అఖిల పక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో జన్నారంలో 300 మందితో..
ఆర్వోఎస్ఆర్ చట్టాన్ని అమలు చేసి గిరిజన, గిరిజనేతర, ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలివ్వాలని కోరుతూ జన్నారంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వివిధ మండలాలకు చెందిన సుమారు 300 మంది ర్యాలీగా వెళ్లి.. తహసీల్దార్ పుష్పలతకు వినతి పత్రం ఇచ్చారు.
నర్సంపేట మండలం ఇటుకాలపల్లిలో..
పోడురైతుల సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటుకాలపల్లిలోని 365 జాతీయ రహదారిపై అఖిల పక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. పోడురైతులపై అటవీశాఖ దాడులను ఆపాలని... 2006 చట్టం ప్రకారం పోడురైతులకు హక్కు పత్రాలు అందించాలని డిమాండ్ చేశారు.
ఇటుకాలపల్లి లోని 365 జాతీయ రహదారిపై నిరసన ప్రదర్శన అసెంబ్లీ వేదికగా గళం విప్పిన నేతలు
పోడు భూముల చట్టాన్ని తెరాస సర్కారు అమలు చేయడంలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గిరిజనుల నుంచి పట్టాలు ఇచ్చిన భూములను లాక్కొని చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ శాసనసభాపక్షం ఈ విషయంపై వాయిదా తీర్మానం ఇస్తే అవకాశం ఇవ్వడంలేదని మండిపడ్డారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహారిస్తే ప్రజలు తిరగబడతారని ఆయన హెచ్చరించారు. సీఎం కేసీఆర్ ఒక్క ఎకరానికి పట్టాలు ఇవ్వకపోగా ఇచ్చిన వాటిని గుంజుకుంటున్నారని ఎమ్మెల్యే పొదెం వీరయ్య మండిపడ్డారు. ప్రజలను కలవని సీఎంను ఎక్కడా చూడలేదన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వకపోతే తెరాస నాయకులను అడ్డుకుంటామని వీరయ్య హెచ్చరించారు. కుర్చీ వేసుకుని పోడు భూముల సమస్య పరిష్కరిస్తానన్న కేసీఆర్ ఇప్పుడు కేంద్రం మీదకు నెట్టుతున్నారని ఎమ్మెల్యే సీతక్క దుయ్యబట్టారు.
పోడు భూముల సమస్యను పరిష్కరించే అవకాశం రాష్ట్ర పరిధిలోనే ఉందని సీతక్క స్పష్టం చేశారు. భాజపా, తెరాస న్యాయం చేయకుండా దాగుడుమూతలు ఆడుతున్నాయని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఆక్షేపించారు.
ఇదీ చూడండి:Podu lands: 'పోడు'పై అసెంబ్లీలో చర్చిద్దాం.. వారికి మరో అవకాశమిద్దాం: కేసీఆర్